EVM : ఈవీఎంలపై తొలగని అనుమానాలు..! ఈసీ స్పందిస్తుందా..?
భారతదేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ గెలవడం సహజం.. కొన్ని పార్టీలు ఓడిపోవడం కామన్. ఓడిపోయిన పార్టీ తమ ఓటమికి ఈవీఎంలే కారణమని ఆరోపిస్తున్నాయి. అదే పార్టీ మరో రాష్ట్రంలో గెలిస్తే దానికి ఈవీఎంలే కారణమని చెప్పలేకపోతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల సందర్భంగా ఈవీఎల పనితీరుపై మళ్లీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలే ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తుతున్నారు. మరి వీటికి ఈసీ స్పందిస్తుందా.?
దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఒకప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరిగేవి. అయితే అదొక సుదీర్ఘ ప్రక్రియ. ఒక్కోసారి ఫలితం వెలువడడానికి రెండు, మూడు రోజుల సమయం పట్టిన కూడా సందర్భాలున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను తెరపైకి తెచ్చింది ఎన్నికల సంఘం. మిగిలిన దేశాల్లో మాదిరి ఈ ఈవీఎంలు ఇంటర్నెట్ తో పనిచేయవు. వేటికవే ఓ యంత్రంలాగా పనిచేస్తుంది. దీంతో ఒకసారి సీల్ వేసిన తర్వాత వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమని పలు సందర్భాల్లో ఈసీ స్పష్టం చేసింది. ఎంతోమంది ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు కూడా..!
అయినా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంలపై అనుమానాలను లేవనెత్తుతున్నారు పలువురు రాజకీయ నాయకులు. తాజాగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర చరిత్రలోనే ఈ కూటమి విజయం చరిత్రాత్మకం. ఈ విజయాన్ని కాంగ్రెస్ కూటమి అస్సలు అంగీకరించట్లేదు. ఈవీఎంలను మార్చేయడం వల్లే ఈ విజయం వరించిందని.. లేకుంటే ఆ కూటమికి అంత సీన్ లేదని ఎద్దేవా చేస్తోంది. ఇదే సమయంలో జరిగిన ఝార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దాంతోపాటు వయనాడ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఈ విజయాలను కాంగ్రెస్ ఈవీఎం వల్లే అని చెప్పలేకపోతోంది.
2019లో ఏపీలో వైసీపీ కనీవినీ ఎరుగని విజయం సాధించింది. 2024లో అదే పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. 2019లో ఈవీఎంలను స్వాగతించిన వైసీపీ.. 2024లో ఓటమి తర్వాత ఈవీఎంలను తప్పుబడుతోంది. హర్యానా ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జగన్ మరోసారి ఈవీఎంల పనితీరును ప్రశ్నించారు. బ్యాలెట్లను మళ్లీ ప్రవేశపెట్టాలని.. ఈవీఎంలను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలపై పలువురు వైసీపీ నేతలు కోర్టుల్లో కూడా కేసులు దాఖలు చేసారు. ఇవి విచారణ దశలో ఉన్నాయి. అయినా గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే మరోలాగా మాట్లాడుతుండండతో ఈవీఎంలపై ఏ పార్టీకీ మాట్లాడే అర్హత లేకుండా పోతోంది. అయితే ఈవీఎంలపై పారదర్శకత తీసుకురాకపోతే ఎన్నికల సంఘం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అలాగే ప్రజాస్వామ్యం ప్రజలు కూడా నమ్మకం కోల్పోతారు.