ప్రజల సొమ్ము ప్రతిపక్షాలను తిట్టడానికి వాడిన జగన్.. ఏపీ హోం శాఖ మంత్రి వైరల్ స్టేట్మెంట్..
ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయాలు మూడు తిట్లు, ఆరు ఆరోపణలు, నాలుగు నిందలు అన్నట్లు సాగుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా రాజకీయంపై చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి.. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం గురించి గత కొద్దికాలంగా జరుగుతున్న రచ్చ మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకొక కొత్త విషయం వైరల్ అవుతుంది. అయితే తాజాగా జనం డబ్బుతో జగన్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటుగా తన కుటుంబ సభ్యులైన షర్మిల, విజయమ్మ, సునీతలపై అసభ్యకర ప్రచారం చేయించారు అంటూ ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపిస్తున్నారు.
2019-24 మధ్యకాలంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గా జగన్, వాసుదేవరెడ్డిని నియమిచి,ఆయనకు నెలకు మూడున్నర లక్షల రూపాయలు జీతం ఇచ్చారని అనిత పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సోషల్ మీడియా వ్యవస్థలను నడిపిస్తూ అతను అప్పట్లో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతలను తిట్టించారని అనిత అన్నారు. నేతలను బూతులు తిట్టడమే కాకుండా.. మార్ఫింగ్ వీడియోలను కూడా పెట్టడానికి జగన్ ఈ రకంగా ప్రజాధనాన్ని ఉపయోగించారు అనిత ఆరోపిస్తున్నారు.
ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవాళ్లు నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు కాదా అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. జగన్ హయాంలో సుమారు 400 గ్రూపులు, 4 యూట్యూబ్ ఛానల్ ఇటువంటి దుష్ప్రచారం చేయడం కోసం పని చేశాయని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ ఎంట్రీ తర్వాత అసభ్యకరమైన పోస్టులు పెరిగాయి అని వర్రా రవీంద్ర రెడ్డి చెప్పిన విషయాన్ని అనిత మరొకసారి గుర్తు చేశారు. తాజాగా ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కేసులో అరెస్ట్ అయిన అర్జున్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఎంతో సన్నిహితుడు అని అనిత చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా క్రైమ్ కథ చిత్రం ఇదే అంటూ ఆమె వైసీపీ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు.