ASBL Koncept Ambience
facebook whatsapp X

తానాలో 3 మిలియన్‌ డాల్లర్ల నిధులు ఎలా మళ్లించారు? ఎలా బయట పడ్డాయి? 

తానాలో 3 మిలియన్‌ డాల్లర్ల నిధులు ఎలా మళ్లించారు? ఎలా బయట పడ్డాయి? 

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తానాలో కీలక విభాగమైన తానా ఫౌండేషన్‌ ద్వారా కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపును పొందారు. ఎంతోమంది దాతలు ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలకోసం నిధులను ఇచ్చేవారు. ఇలాంటి నిధులు ఇప్పుడు ప్రక్కదారి పట్టాయన్న విషయం తెలిసిన తరువాత తానా సభ్యులు చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారం తానాలో సంచలనాన్ని సృష్టించింది.  దాదాపు 3 మిలియన్‌ డాలర్ల నిధులు గల్లంతు అయ్యాయని, గత పాలకవర్గంలో తానా ఫౌండేషన్‌ ట్రెజరర్‌ గా వ్యవహరించిన శ్రీకాంత్‌ పోలవరపు ఎవరి అనుమతి లేకుండా తన సొంత కంపెనీ బృహత్‌ టెక్నాలజీస్‌ కు ఆ నిధులను తరలించారన్న వార్త విని ఉలిక్కిపడ్డారు. దీంతో తానా బోర్డ్‌ చైర్మన్‌ నాగేంద్ర ప్రసాద్‌ కొడాలి, ప్రస్తుత తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి వెంటనే శ్రీకాంత్‌ పోలవరపును సంప్రదించగా, ఆ నిధులను మళ్ళించిన మాట వాస్తవమేనని, తనదే ఆ బాధ్యత అని ఇ-మెయిల్‌ ద్వారా శ్రీకాంత్‌ పోలవరపు ధృవీకరించారు. 

ఈ విషయమై చర్చించేందుకు తానా బోర్డ్‌ అత్యవసర సమావేశాన్ని 25నవంబర్‌ 2024న జరిపింది. దానికి 15 మంది సభ్యులు హాజరయ్యారు. తానా మాజీ ఫౌండేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ యార్లగడ్డ, అప్పటి ట్రజరర్‌ శ్రీకాంత్‌ పోలవరపు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో శ్రీకాంత్‌ పోలవరపు తన చర్యలను ఒప్పుకున్నట్లుగా తెలిసింది. 

అస్సలు ఈ మోసం ఎలా జరిగింది? ఏ విధంగా బయటపడింది? అన్న విషయాలపై ‘తెలుగు టైమ్స్‌’ కొంతమందిని సంప్రదించి నిన్న జరిగిన బోర్డ్‌ సమావేశం వివరాలను సేకరించి, కొంత సమాచారం రాబట్టగలిగింది. 

2021-23 సంవత్సరంలో తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శ్రీ వేంకటరమణ యార్లగడ్డ, ట్రజరర్‌గా శ్రీకాంత్‌ పోలవరపు పని చేశారు. ఆ సమయంలోనే తానా సంస్థ, ఫౌండేషన్‌ సభ్యులు అగ్రెసివ్‌గా పనిచేసి, ప్రచారం నిర్వహించి అందరి దగ్గర నుంచి విరాళాలను పెద్దఎత్తున సేకరించారు. 2023-25 సంవత్సరానికి ఎన్నికలు జరగడం, తానా నాయకత్వంలో గొడవలు రావడం, కార్యవర్గ సభ్యులు గెలిచినవారు, ఓడినవారు కూడా లీగల్‌ గా పోరాటం చేయడం, 2024 ఫిబ్రవరి వరకు ఈ పోరాటం జరగడం, చివరికి కోర్టు నిర్ణయం ప్రకారం కొత్త కార్యవర్గం ఏర్పడటం వంటి విషయాలు అందరికీ తెలిసిందే. 2024 ఫిబ్రవరిలో తానా ఫౌండేషన్‌ కు చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి, ట్రజరర్‌గా వినయ్‌ కుమార్‌ మద్దినేని ఎన్నికై ఫౌండేషన్‌ కార్యకలాపాలను మొదలు పెట్టారు. కోర్టు నిర్ణయం ద్వారా వచ్చిన కార్యవర్గం కనుక నాయకత్వ మార్పిడి సులువుగా అవలేదని, దాదాపు 2,3 నెలలు పట్టిందని తెలిసింది. 

ఫౌండేషన్‌ కు రెండు బ్యాంక్‌ అక్కౌంట్లు ఉన్నాయి. ఒకటి పిఎన్‌సి బ్యాంక్‌ (PNC Bank), రెండవది మేరిల్‌ లించ్‌ బ్యాంక్‌ (Marryl Linch & Co Investment Bank) అనేకసార్లు ఫోన్‌లు, ఇ-మెయిల్స్‌ జరిగిన తరువాత రెండు నెలల తరువాత పిఎన్‌సి బ్యాంక్‌ ఆపరేషనల్‌ ఫెసిలిటీని కొత్త ట్రెజరర్‌ కు గతంలో ట్రెజరర్‌ గా ఉన్న శ్రీకాంత్‌ పోలవరపు ఇవ్వడం జరిగింది. రెండవ బ్యాంక్‌ కు సంబంధించిన విషయంలో ఆపరేషన్‌ ఫెసిలిటీని ఇవ్వడంలో వివిధ కారణాలు చెబుతూ శ్రీకాంత్‌ పోలవరపు జాప్యం చేస్తూ వచ్చారు. 

ఇదే సమయంలో శ్రీకాంత్‌ పోలవరపు మేరీ లించ్‌ బ్యాంక్‌ లో ఉన్న ఫౌండేషన్‌ అక్కౌంట్‌ నుంచి నిధులను తన కంపెనీ బృహత్‌ టెక్నాలజీస్‌ కు నిధులను మళ్ళించడమే కాకుండా, క్విక్‌ బుక్స్‌ (Quickbooks - రోజువారీ ఖర్చులు చూపించే సాప్ట్‌ వేర్‌) లో ఈ మళ్లింపు వ్యవహారాన్ని చూపించకుండా, అందరికీ తెలిసిన కొన్ని జమా ఖర్చుల వివరాలను మాత్రం చూపించారు. జమా ఖర్చుల వివరాలు బుక్స్‌ లో ప్రతినెలా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే బ్యాంక్‌ ఆపరేషన్స్‌ వ్యవహారాన్ని కొత్త కార్యవర్గానికి ఆయన ఇవ్వలేదు. 

2023 సంవత్సరపు అక్కౌంట్స్‌ ను ఆడిట్‌ చేయడానికి ట్యాక్స్‌ రిటర్న్‌ కు ఫైల్‌ చేయాల్సి ఉండటంతో శ్రీకాంత్‌ పోలవరపును బ్యాంక్‌ ఆపరేషన్స్‌ అప్పగించాల్సిందిగా ప్రస్తుత పాలకవర్గం గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చింది. చివరకు అతను 2024 అక్టోబర్‌ లో బ్యాంక్‌ ఆపరేషన్స్‌ ను కొత్త ట్రెజరర్‌ కు అప్పగించారు. అప్పటివరకు బ్యాంక్‌ కి లెటర్‌ ఇచ్చానని, వాళ్ళు మరింత సమాచారం అడిగారని, వాటిని ఇస్తున్నానని, ఈ వారంలో అయిపోతుందని ఇలా ఏదో ఒకటి చెబుతూ ఆపరేషన్స్‌ చేసే అధికారాన్ని అప్పగించకుండా కాలయాపన చేశారు. 

అక్టోబర్‌-నవంబర్‌ నెలలో మేరీలించ్‌ బ్యాంక్‌ అక్కౌంట్స్‌ తీసుకుని ఫౌండేషన్‌ క్విక్‌ బుక్స్‌ లో ఉన్న లెక్కలను చూసుకుని ఆడిట్‌ చేస్తున్నప్పుడు ఫౌండేషన్‌ నిధుల మళ్ళింపు వ్యవహారం బయటపడిరది. వెంటనే శ్రీకాంత్‌ పోలవరపును ప్రశ్నించడం జరిగింది. 

మొత్తం మీద ఈ నిధుల మళ్ళింపు వ్యవహారం తానా సభ్యుల్లోనూ, కమ్యూనిటీలో మాత్రం సంచలనాన్ని కలిగించింది. 

అత్యవసర సమావేశంలో ఏం జరిగింది? తానా బోర్డ్‌ కర్తవ్యం ఏమిటి? 

తానా బోర్డ్‌ 25 నవంబర్‌ 2024న అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. శ్రీకాంత్‌ పోలవరపు తానూ ఇ-మెయిల్‌ లో సమాధానం ఇఛ్చినట్టుగానే  తానూ ఈ పని చేశానని, తీసుకొన్న డబ్బు తిరిగి ఇస్తానని తెలిపారు. మొదటగా తెలుసుకొన్న 3.1 మిలియన్‌ డాలర్లు మాత్రమే కాక ఇంకొక 400,000 డాలర్లు తీసుకున్నట్టు, మొత్తంగా దాదాపు  3.5 మిలియన్‌ డాలర్లు మళ్లించినట్లు తెలుస్తోంది.  ఫౌండేషన్‌ కి ఆ సమయంలో చైర్మన్‌ గా వున్న వెంకట రమణ యార్లగడ్డ కూడా తనకు ఈ విషయాలు తెలియవని, తానూ కూడా అందరిలాగా దిగ్భ్రాంతి చెందానని చెప్పినట్టు తెలిసింది. తానా బోర్డ్‌ కి ఇప్పుడు జటిల సమస్య ఎదురయింది.  నిధులు మళ్లించిన వ్యక్తి తన తప్పు ఒప్పుకోవడంతో, ఏ విధంగా అందరిని ఇంత కాలం మభ్య పరుస్తూ వచ్చాడో తెలియడంతో కొంత ఉపశమనం కలిగినా... తీసుకొన్న డబ్బుని ఎలా వెనక్కి తీసుకురావాలి? ఇవ్వలేకపొతే ఏమి చెయ్యాలి? అన్నవి ఇప్పుడు ప్రధాన సమస్యలు.  అంతే  కాదు... క్రిందటి సంవత్సరం కోర్ట్‌ కెళ్లిన తగాదాలు వలన మసక బారిన తానా ఇమేజి నుంచి  ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణం లో జరిగిన ఈ విపత్తు నుంచి తానా ఇమేజి ని ఎలా కాపాడాలి? సభ్యులకు, తెలుగు కమ్యూనిటీకి ఏ విధంగా సమాధానం చెప్పాలి?  ఇలాటి తప్పులు జరగ కుండా సంస్థలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? 

తానా నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎప్పుడు ఆర్గనైజేషన్‌ లో అగ్ర నాయకత్వం సరిగా లేదో.. ఎప్పుడు నాయకులు కోర్ట్‌ ల చుటూ తిరుగుతూ, సంస్థ పనులు చూడకుండా వుంటారో, సంస్థలో ఇలాంటి మోసాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని గ్రహించాలి. ఒక సీనియర్‌ నాయకుడు మాట్లాడుతూ 2021 ఎన్నికల నుంచి తానా నాయకత్వంలో తగాదాలు మొదలు అయ్యాయి అని, అంతకు ముందు ఎప్పుడూ రెండు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల ముందు చర్చించుకొని సామరస్య వాతావరణంలో ముందుకు వెళ్లేవారని, ఇప్పుడు జరిగిన అనర్థాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని, ముందు ముందు మళ్ళీ నాయకత్వంలో నిర్ణయాలు జరగాలి అని అన్నారు.  

ఇప్పుడు కూడా నిధులు మళ్లించిన వ్యక్తి మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం, కోర్టు ద్వారా డబ్బు వెనక్కి వచ్చే మార్గాలు చూడటం, అన్నింటికీ కంటే ముఖ్యం గా ముందు ముందు ఇలాంటి పనులు జరగకుండా సంస్థ విధి విధానాలలో మార్పులు చేయడం చాలా అవసరం అని అందరూ అంటున్నారు. 70000 మాది లైఫ్‌ మెంబర్లు వున్న దాదాపు 50 ఏళ్లకి చేరుతున్న తానా ఇమేజి ఈ విధంగా మసకబారటం దురదృష్టమే అయినా, ప్రస్తుత నాయకత్వం ఈ సమస్యను అధిగమిస్తుందని ఆశిద్దాం.

 

Venkata Subba Row Chennuri
Editor & CEO- TELUGU TIMES

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :