గిల్ వచ్చేసాడు... వేటు ఎవరిపై...?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో 295 పరుగులతో భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. దీనితో వచ్చే నెల ఆరు నుంచి జరగనున్న రెండో టెస్ట్ పై ఇప్పుడు భారత జట్టు యాజమాన్యం... కూర్పుపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ కు అందుబాటులో లేడు. రెండో టెస్ట్ కోసం తిరిగి జట్టుతో జాయిన్ అవుతున్నాడు. ఇప్పటికే పింక్ బాల్ తో ప్రాక్టీస్ కూడా చేసాడు.
దీనితో జట్టు కూర్పుపై కోచ్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. కీలక స్థానాలపై ఏం చేయాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇప్పటి వరకు రెండో టెస్ట్ కి యువ ఆటగాడు గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని అంచనా వేసారు. కాని గిల్ చేతి వేలి గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రెండో టెస్ట్ కు ఇంకో వారం సమయం ఉంది. ఈ వారంలో గిల్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే మాత్రం అతనికి తుది జట్టులో చోటు ఖాయం అయినట్టే. అదే జరిగితే యువ ఆటగాడు ధృవ జురెల్ ను పక్కన పెడతారు.
పదిక్కల్ స్థానంలో రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది. ఓపెనర్ గా కెఎల్ రాహుల్ ను కొనసాగించే ఆలోచనలో ఉంది జట్టు యాజమాన్యం. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్ లో కీలక మార్పులు ఉంటాయి. గిల్ వస్తే యువ ఆటగాళ్ళు పడిక్కల్, జురెల్ ను పక్కన పెట్టనున్నారు. గిల్ కచ్చితంగా జట్టులో ఉంటాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన గిల్ మంచి ప్రదర్శన చేసాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో, గిల్ 51.80 సగటుతో 91 అత్యధిక స్కోరుతో 259 పరుగులు చేశాడు. జట్టులో చోటు ఖరారు అయినా బ్యాటింగ్ ఆర్డర్ పై క్లారిటీ రావాల్సి ఉంది.