దిక్కు లేకపోయినా పట్టు వదలని పాక్ బోర్డు, ఐసీసీని బ్లాక్ మెయిల్ చేస్తోందా...?
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు స్పష్టం చేసింది. శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయంపై చర్చించవద్దని గ్లోబల్ గవర్నింగ్ బాడీని కోరింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ కు తమ జట్టును పంపడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంగీకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. హైబ్రిడ్ మోడల్ తమకు ఆమోదయోగ్యం కాదని పాక్ క్రికెట్ బోర్డ్ ముందు నుంచి వాదిస్తోంది.
భారత్ కు అంత ఇబ్బందిగా ఉంటే... మ్యాచ్ ఆడిన తర్వాత ఢిల్లీ లేదా చండీగడ్ వెళ్లిపోవచ్చు అని... భద్రత బాధ్యత పూర్తిగా తాము తీసుకుంటాం అని పాక్ ప్రభుత్వంతో కూడా చెప్పించింది. అయినా సరే భారత్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ముందు ఓ షరతుపై పాక్ అంగీకరించినట్టే కనపడింది. పాకిస్తాన్‌లో భారత జట్టు ఆడలేకపోతే, భవిష్యత్తులో 2031 లో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసి ఈవెంట్స్ ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు అంగీకరించాలని పాక్ ముందు కోరింది.
తర్వాత ఈ విషయంపై పునరాలోచనలో పడింది పాక్. దుబాయ్ లేదా అరబ్ ఎమిరేట్స్ లో మ్యాచ్ లకు తాము అంగీకరించేది లేదని... కావాలంటే భారత్ ఆడే అన్ని మ్యాచ్ లు లాహోర్ లో ఆడుకోవచ్చు అని చెప్తోంది. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టుకు క్లియరెన్స్ ఇవ్వలేదని బీసీసీఐ తమ ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా లేఖను సమర్పించిందో లేదో తెలియజేయాలని పీసీబీ.. ఐసీసీని కోరింది. ఐసిసి నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తమ ప్రభుత్వం వేరే దేశంలో ఆడటానికి అనుమతించకపోతే.. బోర్డు తమ ప్రభుత్వ ఆదేశాలను వ్రాతపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది.
కాని ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి అలాంటిది ఏం జరగలేదని పాక్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటీ అంటే... భారత్ పట్టు వీడే అవకాశం లేదనే విషయం పాక్ కు క్లారిటీ ఉంది. ఐసీసి భారత్ మాటను కాదనే అవకాశం కూడా లేదనే విషయం పాక్ కు స్పష్టమైన అవగాహన ఉంది. పాక్ ఒక్క విషయంపై ఐసీసీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగకపోతే బ్రాడ్ కాస్ట్ చానల్స్ కు ఐసీసీ భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకుని పాక్ బోర్డు పట్టుబడుతోంది. మరి ఈ విషయంలో ఐసిసి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.