ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ బాటలో కూటమి ప్రభుత్వం.. ఈసారైనా లెక్కలు మారుతాయా?

వైసీపీ బాటలో కూటమి ప్రభుత్వం.. ఈసారైనా లెక్కలు మారుతాయా?

జగన్ హయాంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విధి విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంతో మేలు జరుగుతుంది అని ఆశించి ప్రారంభించిన ఈ కార్యక్రమం వల్ల ఎన్నికల్లో వైసీపీ కి ఎటువంటి ఫలితం దక్కిందో మనందరికీ తెలుసు.

అయితే ఇప్పుడు కూటమి పార్టీ నేతలు కూడా ఇదే చేయబోతున్నారు. ఈరోజుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ముచ్చటగా 100 రోజులు పూర్తయింది. ఈ మైలురాయిని దాటిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ టీడీపీ కాస్త హడావిడి మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో 100 రోజుల్లో చేసిన మేలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. మరో పక్క వైసీపీ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ప్రచారం ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్ 100 రోజుల పాలన పూర్తి చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలినాడే ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ, ఇటీవల ఏర్పడిన విజయవాడ విపత్తును దాటిన వైనం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ప్రజల కోసం కూటమి ప్రభుత్వం పడుతున్న కష్టం గురించి వివరించి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఈ 100 రోజులుగా కూటమి సర్కార్ కు ఎన్ని సవాళ్లు ఎదురయ్యాయి.. వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ ప్రజలలో తమపై ఓ సాఫ్ట్ కార్నర్ను క్రియేట్ చేయడానికి చంద్రబాబు గట్టి ప్లానింగ్ చేస్తున్నారు. 

ఐదు సంవత్సరాలు పూర్తయ్యేంతవరకు ఆగి ఆ తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకొని మాత్రం ప్రయోజనం ఉండదు.. అందుకే ముందుగా తమ పాలనలో జరుగుతున్న అవకతవకలను అవగాహన చేసుకొని ఈసారి ఎన్నికల్లో కూడా విజయం పొందాలి అనే బాబు ఆలోచనకు అంకురార్పనే ఈ కార్యక్రమం అని అందరూ భావిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతవరకు స్పందిస్తారు అన్న విషయం చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :