ASBL NSL Infratech
facebook whatsapp X

జగన్‌కు కాంగ్రెస్ కూటమే దిక్కా..?

జగన్‌కు కాంగ్రెస్ కూటమే దిక్కా..?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమే అధికారంలో ఉంది. దీంతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు జగన్. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇన్నాళ్లూ బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు ఇప్పుడు వెళ్లలేని సంకట స్థితి ఏర్పడింది. టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తుండడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పుడు జగన్ కు ఇండియా కూటమే దిక్కుగా మారినట్లు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర కావస్తోంది. ఈ 45 రోజుల్లో దాదాపు 36 మంది హత్యకు గురయ్యారని, 300 మంది పైన దాడులు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన ఢిల్లీలో ఒక్కరోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సమాజ్ వాదీ పార్టీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, ముస్లిం లీగ్, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. వైసీపీకి సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ ఈ ధర్నాకు హాజరుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే వైసీపీ ధర్నాకు వచ్చిన పార్టీలన్నీ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కావడం విశేషం.

ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన ప్రధాన పార్టీలన్నీ వైసీపీ ధర్నాకు హాజరై జగన్ కు అండగా నిలిచాయి. అంతేకాదు.. ముస్లిం లీగ్ నేతలు జగన్ ను ఇండియా కూటమిలోకి వచ్చేయాలని వేదిక మీదే ఆహ్వానించారు. దీంతో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగిందే మనందరికీ తెలుసు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు జగన్. అప్పటి నుంచి కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉండడంతో ఆ పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దీంతో ఇన్నాళ్లూ కాంగ్రెస్ వైపు వెళ్లాలనే ఆలోచన జగన్ కు రాలేదు.

కానీ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నారు. ఆ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలు తనకు అండగా నిలుస్తాయని నమ్మే పరిస్థితి లేదు. రేపు ఏదైనా ఇబ్బంది ఎదురైతే అండగా నిలబడే పార్టీలు లేకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఇండియా కూటమిలోని పార్టీలతో ఇప్పుడు సన్నిహితంగా మెలగుతున్నారు. భవిష్యత్తులో అవసరమైతే ఇండియా కూటమిలో కూడా చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇండియా కూటమి కూడా జగన్ ను తమతో కలిసి రావాలని కోరుకుంటోంది. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో..!

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :