వెయ్యి ఏనుగుల బలం, కేజిఎఫ్ డైలాగ్ టీం ఇండియాకు అచ్చుగుద్దినట్టు సెట్...
కేజిఎఫ్ సినిమా చూసారా...? గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది... ఈ డైలాగ్ ఆ సినిమాలో హీరోకు ఎంత సెట్ అయిందో తెలియదు గాని... ఇండియన్ క్రికెట్ టీం కోసమే రాసినట్టు ఉంటుంది మొదటి టెస్ట్ లో మన వాళ్ళ ఆట చూస్తే. పగబట్టిన పాములా... ఆస్ట్రేలియాను వేటాడి, వెంటాడి ఓడించారు. ఆస్ట్రేలియా మైదానాలకు... ఆ జట్టు ఆటగాళ్లకు ఒక పోలిక ఉంటుంది. నీళ్ళల్లో ఉన్న మొసలితో పోలుస్తూ ఉంటారు. మొసలి నీళ్ళల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో ఆస్ట్రేలియా కూడా వాళ్ళ మైదానంలో ఆడితే అంతే...
అలాంటి కంగారులను మన యువ భారత్ పరుగులు పెట్టించింది. సీనియర్లు జూనియర్లు కలిసి ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే పెర్త్ మైదానంలో ఓడించారు. ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు ప్రతీ ఒక్కరు తమ కెరీర్ లోనే అత్యంత అద్భుతమైన ప్రదర్శన చేసారు. ప్రతీ ఆటగాడు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చిరకాల విజయాన్ని అందించారు. కివీస్ పై ఓటమి ప్రభావమో మరొకటో తెలియదు గాని... ప్రతీ ఒక్కరు కసితో ఆడారు. ఓపెనర్ కెఎల్ రాహుల్... రెండు ఇన్నింగ్స్ లలో ఆస్ట్రేలియాకు తన డిఫెన్స్ టెక్నిక్ తో చుక్కలు చూపించాడు.
మొదటి ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినా రెండో ఇన్నింగ్స్ లో భారీ సెంచరీతో జైస్వాల్ దుమ్ము రేపాడు. యువ ఆటగాడు పదిక్కల్ పరుగులు పెద్దగా చేయకపోయినా... కీలక సమయంలో మంచి స్టాండ్ ఇచ్చాడు. మంచి డిఫెన్స్ ఆడి... జైస్వాల్ కు సహకారం అందించాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీంలో అందరి కంటే ఒత్తిడి ఎక్కువ ఉన్నదీ కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపైనే. మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ విఫలమైనా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ సాధించి... తన ఆకలి తీర్చుకున్నాడు.
ఇక రిశబ్ పంత్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన సమయంలో 36 పరుగులు చేసాడు. రెండో ఇన్నింగ్స్ లో స్కోర్ పెంచే ఉద్దేశంతో కాస్త తొందరి పడి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్... ఆల్ రౌండర్ గా తన సత్తా చాటాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా... అనుభవం ఉన్న ఫాస్ట్ పిచ్ లపై మంచి డిఫెన్స్ ఆడుతూ... రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక యువ ఆటగాడు నితీష్ రెడ్డి ప్రదర్శన అమోఘం అనే చెప్పాలి. ఏ మాత్రం అనుభవం లేకపోయినా స్వేచ్చగా బ్యాటింగ్ చేసాడు.
రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన వికెట్ పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో 41 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక హర్షిత్ రానా... బౌలింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. పదునైన బంతులతో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసాడు. ట్రావిస్ హెడ్ వికెట్ అతని కెరీర్ లో ది బెస్ట్. ఇక బూమ్రా గురించి చెప్పాలంటే పుస్తకాలు కాదు గ్రంధాలు కావాలి అంటున్నారు ఫ్యాన్స్. అతని కెప్తెన్సీ, బౌలింగ్ అన్నీ కూడా జట్టుకు ప్రధాన బలం అయ్యాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకు ఆల్ అవుట్ అయింది అంటే అది బూమ్రా పుణ్యమే.
తన బౌలింగ్ అటాక్ తో ఏ దశలో కూడా ఆస్ట్రేలియా కోలుకోలేదు. రెండో ఇన్నింగ్స్ లో కూడా కీలక ప్రదర్శన చేసాడు. ఇక సిరాజ్ కూడా మెరుగైన ప్రదర్శన చేసి... వికెట్ల దాహం తీర్చుకున్నాడు. ఇలా జట్టులో ప్రతీ ఆటగాడు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు గిల్ దూరమైనా ఆ లోటు లేకుండా ఆడారు. మిగిలిన మ్యాచ్ లలో కూడా ఇదే ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విజయంతో భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ టేబుల్ లో అగ్ర స్థానానికి చేరుకుంది.