అమెరికా వర్సిటీల్లోనూ మనవిద్యార్థుల హవా...
అంతర్జాతీయంగా భారత్ ప్రభ వెలిగిపోతోంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలకు సీఈవోలుగా .. ఇప్పటికే పలువురు భారతీయులు పనిచేస్తున్నారు. ఆయా కంపెనీలను నిలబెడుతుంది మనోళ్ల మార్గదర్శకత్వమే అంటే అతిశయోక్తి కాదు. అయితే.... ఇప్పుడు ఏకంగా వివిధ దేశాల్లోనూ మన విద్యార్థులే అత్యధికంగా విద్యను అభ్యసిస్తున్నారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది.
గత విద్యా సంవత్సరం(2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది మనవాళ్లే.\ యూఎస్‌ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్-2024ను దిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విడుదల చేశారు. అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది.
భారత్, చైనా తర్వాత జాబితాలో దక్షిణకొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయి. అమెరికా వెళ్లే భారత పట్టభద్రుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి 1,96,567కు, అండర్ గ్రాడ్యుయేట్లు సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరుకుంది. చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 41 శాతం ఎగబాకి 97,556కు చేరుకుంది.అమెరికా నుంచి భారత్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్యా పెరుగుతోంది. అంతకు ముందు సంవత్సరం 336 మందిరాగా ఈసారి ఆ సంఖ్య 1,355కు చేరుకుంది.