ఐపీఎల్ వేలంలో రికార్డ్స్ బ్రేక్.. పంత్, శ్రేయాస్ కు భారీ ధర
ఐపీఎల్ వేలంలో (IPL Mega Auction 2025) ఆటగాళ్లపై కోట్లు గుమ్మరించింది. తగ్గేదేలే అంటూ ఫ్రాంఛైజీలు హోరాహోరీగా పోటీపడడంతో ఆటగాళ్ల పంటపడింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. ఊహించినట్లే స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు. పంత్ కంటే కేవలం పాతిక లక్షలు తక్కువ అంతే. అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేశ్ అయ్యర్. అనూహ్యంగా రూ. 23.75 కోట్లకు అమ్ముడుపోయి ఔరా అనిపించాడు. చెరో 18 కోట్లతో అర్ష్‌దీప్, చాహల్‌లూ జాక్‌పాట్‌లు కొట్టేశారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వార్నర్‌ను కొనేవాళ్లే లేకపోవడం గమనార్హం.
తొలి రోజు 10 ఫ్రాంఛైజీలు (IPL Auction 2025) కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి. నాలుగు ఆర్టీఎం కార్డులను ఉపయోగించాయి. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను దక్కించుకోగా.. అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ 4 క్రికెటర్లను తీసుకుంది. ఓవరాల్‌గా పంత్ (రూ.27 కోట్లు), విదేశీ ఆటగాళ్లలో బట్లర్ (రూ.15.75 కోట్లు), అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లలో రసిఖ్ సలాం (రూ.6 కోట్లు) అత్యధిక ధర పలికారు.
వేలంలో రిషబ్ పంత్ (Rishabh Pant) అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్ కోసం వేలంలో మొదటి నుంచి పట్టుబట్టిన లఖ్‌నవూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కినెట్టింది. చివరగా రూ.20.75 కోట్ల దగ్గర మిగతా ఫ్రాంఛైజీలు తప్పుకోవడంతో లఖ్‌నవూ మిగిలింది. ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) వాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో పంత్ గరిష్ఠ బిడ్‌ను రూ.27 కోట్లుగా లఖ్‌నవూ పేర్కొంది. కానీ అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు రాకపోవడంతో పంత్‌ను లఖ్‌నవూ సొంతం చేసుకుంది.
అంతకంటే ముందు శ్రేయస్ అయ్యర్‌ను (Shreyas Iyer) పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ (2023లో రూ.24.75 కోట్లు) రికార్డును శ్రేయస్ బద్దలుకొట్టాడు. కానీ కాసేపటికే శ్రేయస్‌ను పంత్ అధిగమించాడు. మరో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) కేవలం రూ.14 కోట్లకే ఢిల్లీతో చేరాడు. చాహల్ కోసం ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు ఖర్చు చేసింది. తొలి రోజు మొదట వేలానికి వచ్చిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కూ మంచి ధర లభించింది. రూ.18 కోట్లకు అతణ్ని పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది. యువ వికెట్‌కీపర్ జితేశ్ శర్మ (బెంగళూరు- రూ.11 కోట్లు), పేసర్ నటరాజన్ (ఢిల్లీ- రూ.10.75 కోట్లు)కూ అంచనాలకు మించిన ధర దక్కింది.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రూ.9.75 కోట్లకు పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ సొంతమయ్యాడు. విదేశీ క్రికెటర్లలో బట్లర్ (గుజరాత్- రూ.15.75 కోట్లు), హేజిల్‌వుడ్ (బెంగళూరు- రూ.12.50 కోట్లు), ఆర్చర్ (రాజస్థాన్- రూ.12.50 కోట్లు), బౌల్ట్ (ముంబయి- రూ.12.50 కోట్లు), ఫిల్ సాల్ట్ (బెంగళూరు- రూ.11.50 కోట్లు), స్టాయినిస్ (పంజాబ్- రూ.11 కోట్లు), రబాడ (గుజరాత్- రూ.10.75 కోట్లు), నూర్ అహ్మద్ (చెన్నై- రూ.10 కోట్లు)కు ఎక్కువ ధర దక్కింది. 2018 నుంచి ఈ ఏడాది వరకూ ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) వచ్చే సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున బరిలో దిగబోతున్నాడు. ఈ టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ కోసం గుజరాత్ రూ.12.25 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహమ్మద్ షమి (రూ.10 కోట్లు) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) భారీగానే వెచ్చించింది.