ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇజ్రాయెల్ పై ఇరాన్ కు ఎందుకంత పగ..?

ఇజ్రాయెల్ పై ఇరాన్ కు ఎందుకంత పగ..?

ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య సంఘర్షణ ఇటీవలి కాలంలో మొదలైంది కాదు. ఇదేదో గాజాపై దాడి చేసిందనో.. హెజ్ బొల్లా ఉగ్రవాదులను ఏరివేస్తుందనో కాదు.. అంతకన్నా ముందే.. అంటే దశాబ్దాల వైరమన్నమాట. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. అయితే అది సమయం వచ్చినప్పుడల్లా బయటపడుతూనే ఉంది. తాజా దాడులతో అది కాస్త యుద్ధంలా పరిణమించింది.

1979 నుంచి..

కొద్దిరోజులుగా ఇజ్రాయెల్, హెజ్ బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రరూపు దాల్చాయి. లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ పై హెజ్ బొల్లా దాడులు చేస్తూ ఉంది. ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఎదురుదాడులు చేస్తూ వస్తోంది. గాజాపై దాడులు చేస్తున్న సమయంలో .. ఇజ్రాయెల్ ప్రయత్నాలకు ఆటంకం కలిగించేందుకు హెజ్ బొల్లా దాడుల తీవ్రత పెంచింది. అయితే .. సమయం చూసి ఇజ్రాయెల్ సైతం తన యుద్ధతంత్రానికి పదును పెట్టింది. ఇప్పుడు నేరుగా లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ భాగంలోని హెజ్ బొల్లా పట్టున్నప్రాంతాలపై యుద్ధవిమానాలతో దాడులు చేసింది. ఇప్పుడు నేరుగా భూతల యుద్ధానికి దిగింది.

అమెరికా వ్యతిరేక సెంటిమెంట్

1979 లో, ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్ తన చివరి రాజు షా మొహమ్మద్ రెజా పహ్లవిని గద్దె దింపింది. లెబనాన్ లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి ఈ ప్రాంతంలో స్వేచ్ఛను కోరుతున్న ఇతర మిలిటెంట్ గ్రూపులతో జతకట్టింది. ఈ కాలం ఇరాన్, హిజ్బుల్లాలను ఏకతాటిపైకి తెచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ అనుసరించిన పాలస్తీనా వ్యతిరేక ధోరణి కారణంగా పొరుగు దేశం ఇజ్రాయెల్ తో ఇరాన్ కు సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే, అమెరికా వ్యతిరేక భావన అమెరికాతో మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ను దూరం చేసింది.

అక్టోబర్ 7, 2023 - మంటలకు ఆజ్యం

ఇక సిరియాలోని గోలన్ హైట్స్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ సమయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు రగులుతూనే ఉన్నాయి. అయితే, 2023 అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హతమార్చింది. చాలామందిని బందీలుగా తీసుకువెళ్లింది. ఈ మెరుపు దాడితో ఇజ్రాయెల్ నివ్వెరపోయింది. వెంటనే, హమాస్ పై యుద్ధం ప్రకటించి, హమాస్ ప్రబలంగా ఉన్న పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించారని పాలస్తీనా ప్రకటించింది. అక్టోబర్ 7న జరిగిన సంఘటనల గురించి తమకు తెలియదని ఇరాన్ ఖండించినప్పటికీ, హమాస్ తో ఇరాన్ కు ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్ ను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిందించింది. అదే సమయంలో, లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇరాన్ కమాండర్లు హతం

గత సంవత్సరం డిసెంబర్ లో సిరియాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ నేత సయ్యద్ రజీ మౌసవి మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ డమాస్కస్ లోని ఓ భవనంపై బాంబు దాడి చేసి ఐఆర్ జీసీకి చెందిన మరో ఐదుగురిని హతమార్చిందని ఇరాన్ ఆరోపించింది. మార్చిలో జరిగిన మరో బాంబు దాడిలో డమాస్కస్ లో ఇద్దరు ఐఆర్ జీసీ సభ్యులు మరణించారు. ఏప్రిల్ లో ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులతో సిరియాలోని తమ కాన్సులేట్ ధ్వంసమైన తర్వాత ఇరాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ దాడిలో ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ సహా 13 మంది మరణించారు. ఈ ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ 'ట్రూ ప్రామిస్' పేరుతో ఇజ్రాయెల్ పై 300కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

లెబనాన్ లో వాకీటాకీ, పేజర్ పేలుళ్లు

సెప్టెంబర్ 17 న లెబనాన్, సిరియాలోని కొన్ని ప్రాంతాలలో ఏకకాలంలో వందలాది పేజర్లు పేలాయి. హిజ్బుల్లా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆ పేలుళ్లలో పలువురు పౌరులు, హెజ్బొల్లా సానుభూతిపరులు, మిలిటెంట్ నాయకులు మరణించారు. ఆ తరువాత, ఇజ్రాయెల్ బీరుట్ లోని దహియే ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వరుస వైమానిక దాడులు చేసింది. సెప్టెంబర్ 26న రోజుల తరబడి సాగిన భారీ బాంబుదాడిలో సుమారు ఏడు భవనాలు నేలమట్టం కాగా, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి కూడా ప్రాణహాని ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించింది ఇరాన్.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :