త్వరలో సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు : సీఎం చంద్రబాబు
పార్టీ సభ్యత్వ నమోదులో మొదటి పది స్థానాల్లో ఉన్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనతికాలంలోనే సభ్యత్వాలను 52 లక్షలకు చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా, ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని, ఇదొక చరిత్ర అని అన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా మంత్రి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు. అన్ని విధాలుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడినపెడుతూనే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. సరైన వ్యక్తిని సరైన చోట ఉంచుతామన్న మాటకు కట్టుబడి, పార్టీ కోసం శ్రమించిన వారిని పదవుల్లో నియమిస్తున్నామని వెల్లడించారు.
కొద్ది రోజుల్లోనే సాగునీటి సంఘాలు, కో `ఆపరేటివ్ ఎన్నికలు జరగనున్నాయి. వీటీల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పని చేయాలి. రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్ 10లో ఉన్నాయి. అక్కడి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రోడ్ల మరమ్మతులకు రూ.1400 కోట్లు మంజూరు చేశాం. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తాం. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలు పరిష్కారిస్తాం అని తెలిపారు.