Revanth Reddy : రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తప్పిస్తోందా..?
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ యుద్ధం నడుస్తోంది. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉంది బీఆర్ఎస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీగా దానికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ఆ పార్టీ. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉందని.. త్వరలోనే ఆయన్ను తప్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టబోతోందనే ఊహాగానాలు జోరుగా మొదలయ్యాయి.
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇటీవల తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను చేర్చుకునే వ్యవహారం రాష్ట్రస్థాయిలో అభాసుపాలయ్యేలా చేసిందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందన్నారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు సైతం సంతృప్తిగా లేరని.. వాళ్లు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు కూడా వివాదాస్పదం కావడంతో.. ఆయన్ను తప్పించే అవకాశం కనిపిస్తోందన్నారు.
మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ ను బీఆర్ఎస్ నేతలు ఫుల్ గా క్యాష్ చేసుకున్నారు. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారంటూ తమకు అనుకూల సోషల్ మీడియాలో పుంఖానుపుంఖానులుగా కథనాలు వండివార్చారు. అంతటితో ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకొచ్చారు. దీంతో ఇవన్నీ ఊహాగానాలేనని ఇందులో ఎలాంటి వాస్తవమూ లేదని అందరికీ అర్థమైపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ పగటి కలలు కంటున్నాయని... వాళ్ల కోరిక నెరవేరే అవకాశమే లేదని రేవంత్ రెడ్డి సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బీఆర్ఎస్ కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఆ పార్టీని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆ పార్టీ వైఫల్యాలను అడుగడుగునూ ఎత్తి చూపుతున్నారు. గత అక్రమాలను తవ్వి తీస్తున్నారు. త్వరలోనే కీలక బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే జన్వాడ ఫాంహౌస్ లో డ్రగ్స్ వ్యవహారంపై కేసు నమోదైంది. ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు ఊపిరి సలపట్లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై బురదజల్లడం ద్వారా హైకమాండ్ దృష్టిలో పడేలా చేయాలనేది బీఆర్ఎస్ స్ట్రాటజీగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలోకి రాకపోవడానికి నాటి కాంగ్రెస్ నేతలే కారణమనే విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు బాగా తెలుసు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే ఎవర్నీ లెక్కచేయకుండా రేవంత్ ను సీఎం సీట్లో కూర్చెబెట్టింది హైకమాండ్. ఇప్పుడు నేతలంతా రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారు. ఇందుకు హైకమాండ్ ఆదేశాలే కారణం. ఇంతటి నమ్మకాన్ని సంపాదించుకున్న రేవంత్ రెడ్డిని తప్పించే అవకాశమే లేదు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం పగటి కలలు కంటున్నాయి.