ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇస్కాన్ పై వ్యతిరేకతా..? భారత్ కు పరోక్ష హెచ్చరికలా...?

ఇస్కాన్ పై వ్యతిరేకతా..? భారత్ కు పరోక్ష హెచ్చరికలా...?

ఆధ్మాత్మిక గురువుపై బంగ్లాదేశ్‌ దేశద్రోహి ముద్రవేయడంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. అక్టోబర్ 30న చిన్మయ్ కృష్ణదాస్‌ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని ఆయనపై అభియోగం మోపారు. నవంబరు 25న చిన్మయ్‌ని ఢాకా ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయ్‌కి బెయిల్‌ నిరాకరించటంతో.. మొదలైన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

చిన్మయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురయ్యారు. తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలోనే మైనారిటీలు లక్ష్యంగా భారీగా లూటీలు, దాడులు జరిగాయి. హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు మతోన్మాదులు. చిన్మయ్ కృష్ణదాస్‌ని జైల్లోపెట్టాక.. ఇస్కాన్‌కి వ్యతిరేకంగా జమాతే కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం ఇవ్వడమే కాదు.. ఇస్కాన్ ఆలయ బోర్డు కూడా తీసేసి తమ సంస్థ బోర్డు పెట్టుకున్నారు.

చిన్మయ్‌ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ కార్యకలాపాలతో పాటు హిందువులకు గురువుగా మారారు. బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు బంగ్లాదేశ్‌ ప్రభుత్వాధినేతకు నచ్చడం లేదు. అందుకే ఇస్కాన్‌ని లక్ష్యంగా చేసుకుంది యూనస్‌ ప్రభుత్వం. ఇస్కాన్‌కు బంగ్లాదేశ్‌లో మొత్తం 65 దేవాలయాలున్నాయి. 50 వేలకు పైగా అనుచరులున్నారు. ఆలయాలపై దాడులతో ఆవేదనకు గురవుతున్న హిందువులకు ఈ మధ్యే ధైర్యం చెప్పారు మహ్మద్‌ యూనస్‌. దుర్గా పూజ సందర్భంగా ఢాకేశ్వరి ఆలయానికి వెళ్లి హిందువులకు శుభాకాంక్షలు చెప్పారు. అందరూ సమానమేనని చెప్పారు. ఈలోపే ఇస్కాన్‌పై కన్నెర్ర చేయడానికి.. జమాత్‌ ఎ ఇస్లామీ ఒత్తిడే కారణమని భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ నాయకుడి అరెస్ట్‌పై భారత్‌లో నిరసనలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధార ఆరోపణలు దారుణమని చిన్మయ్‌ అరెస్ట్‌పై స్పందించింది ఇస్కాన్‌ సంస్థ. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది. హసీనాని గద్దెదించాక ఓ లక్ష్యంతోనే బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. చిన్మయ్‌ అరెస్ట్‌కి ముందే ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఇస్కాన్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు బంగ్లా పోలీసులు. దేశంలో మతపరమైన హింసకు ఇస్కాన్‌ సభ్యులే కారణమని, భారత నిఘా సంస్థకు వారు అనుబంధంగా పని చేస్తున్నారని ఆరోపించారు.

అనేక విపత్తుల్లో బంగ్లా ప్రజలకు అండగా నిలిచిన ఇస్కాన్‌పైనే దేశద్రోహి ముద్రవేశారు. అయితే ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై బ్యాన్ విధించాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఇస్కాన్‌ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో రిపోర్ట్ ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. 17 కోట్ల బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్టు 5న షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి.

తాజాగా కృష్ణదాస్‌ అరెస్ట్‌ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో భారత్‌ అప్రమత్తమైంది. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని కోరారు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌. జనవరి 2013 నుంచి సెప్టెంబరు 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై కనీసం 3వేలకు పైనే దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక మతతత్వశక్తులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్‌ టార్గెట్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్‌పై ఇప్పటిదాకా ఎక్కడా ఏ వివాదాలూ లేవు. చివరికి భారత్‌పై విషంకక్కే పాకిస్తాన్‌లోనూ ఇస్కాన్‌ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఎక్కడా లేనివిధంగా బంగ్లాదేశ్‌లోనే వివాదం తలెత్తడం చూస్తుంటే.. ఇది కుట్రగానే కనిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :