భారత్ పై PLAN-B అమలు చేస్తున్న బంగ్లాదేశ్..
భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ని కోరతామన్నారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయం చెప్పారు. హసీనా పాలనలో జరిగిన హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తుతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హసీనాను అప్పగించే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని బంగ్లాదేశ్ ఇప్పటికే హెచ్చరించింది. భారత్‌పై ఒత్తిడిపెంచే వ్యూహంలో భాగంగానే ఇస్కాన్‌పై విషం కక్కుతోందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్‌ని తమ అధీనంలోకి తీసుకోడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని హిందువులకు పెద్దదిక్కుగా ఉన్నారు చిన్మయ్ కృష్ణదాస్. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటోందనే ఆరోపణలతో చివరికి చిన్మయ్‌ని జైల్లోపెట్టింది అక్కడి ప్రభుత్వం.
ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని కోరారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. జనవరి 2013 నుంచి సెప్టెంబరు 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై కనీసం 3వేలకు పైనే దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక మతతత్వశక్తులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ టార్గెట్ అయింది. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లా పౌరుల్లో కొందరు అప్పట్లో ఆయన పర్యటనని వ్యతిరేకించారు. పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. 1964-2013 మధ్య కాలంలో తీవ్ర వివక్షకు గురయ్యారు బంగ్లాదేశ్ హిందువులు. దాదాపు కోటి మందికి పైనే బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిపోయారు.
.