కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్, హెజ్ బొల్లా ..
పశ్చిమాసియా రావణకాష్టాన్ని చల్లార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓవైపు హెజ్ బొల్లా, హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా హెజ్ బొల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు..సూత్రప్రాయ ఆమోదం తెలిపారని సమాచారం. కొలిక్కిరాని కొన్ని అంశాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఒప్పందాన్ని ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదించొచ్చని తెలుస్తోంది. మరోవైపు... కొద్దిరోజుల్లోనే ఒప్పందం ఖరారు కాబోతోందని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి మైక్ హెర్‌జోగ్ కూడా ‘ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో’కు తెలిపారు.
అయితే ఓవైపు శాంతి చర్చల దిశగా సాగుతూనే ఇజ్రాయెల్ మాత్రం.. తన వేట కొనసాగిస్తోంది. ఇప్పటికీ బ్లూ ప్రింట్ అమలు చేస్తోంది. అయితే ఈ క్రమంలో వేలాదిగా అమాయకులు మృతి చెందడం మాత్రం .. ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఐసీసీ.. యుద్ధనేరాల కింద నెతన్యాహుకు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీన్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇక అమెరికా అయితే.. ఇది సమంజసమైన చర్య కాదంది. తాము ఎప్పటికీ ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉంటామని తేల్చి చెప్పింది.
నెతన్యాహుకు మరణశిక్ష విధించాలి: ఖమేనీ
నెతన్యాహుకు మరణశిక్ష విధించాలని ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ డిమాండ్ చేశారు. గాజాస్ట్రిప్‌లో, లెబనాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాల్లో ఆయన పాత్రకు గానూ ఈ శిక్ష విధించాల్సిందేనని ‘ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్’ స్వచ్ఛంద విభాగమైన బాసిజ్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహుకు అరెస్టు వారంటు జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని ఖమేనీ ప్రస్తావించారు. ఈ వారంటు ఒక్కటే సరిపోదని అభిప్రాయపడ్డారు. నెతన్యాహుకు, ఇతర క్రిమినల్ నేతలకు మరణదండన విధించాల్సిందేనన్నారు.