ASBL Koncept Ambience
facebook whatsapp X

PROBA-3: సూర్యుడి గుట్టు విప్పే ప్రయత్నం.. ప్రోబా -3ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న పీఎస్‌ఎల్వీ సీ-59(pslv C-59) ..

PROBA-3: సూర్యుడి గుట్టు విప్పే ప్రయత్నం.. ప్రోబా -3ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న పీఎస్‌ఎల్వీ సీ-59(pslv C-59) ..

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్‌(SHAR) అంతరిక్ష కేంద్రంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (EU)ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. ఒక్కో ప్రోబా-త్రీ ఉపగ్రహం బరువు 550 కేజీలు ఉన్న వాటిని భూ కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నారు. 2 ఉపగ్రహాలు సూర్యునిపై పరిశోధనలు చేయనున్నాయి. ఇందులో ఓకల్టర్ శాటిలైట్ (OSC), కరోనా గ్రాస్ శాటిలైట్ (CSC ) అనే రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. రాకెట్ సహా మొత్తం 320 టన్నులను నింగిలోకి పంపబోతున్నారు.

SUN CORONA LAYER: సూర్యుడి గుట్టు విప్పే ప్రయత్నం..

సూర్యుడి భగభగల మాటున ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. ముఖ్యంగా భానుడి వెలుపలి వలయమైన కరోనా గురించి చాలా తెలియాల్సి ఉంది. అయితే ప్రచండ సూర్యుడి దేదీప్యమాన వెలుగుల నడుమ.. మసకమసకగా ఉండే ఈ పొరను వీక్షించడం చాలా కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించి, కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా-3 పేరుతో జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం దీని ప్రత్యేకత. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పీఎస్‌ఎల్‌వీ-సి59 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.

ప్రోబా-3లో ...?

కరోనా పరిశీలనలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3ని రూపొందించారు. ఇందులో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. ఆకల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ (ఓఎస్‌సీ) ...కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ (సీఎస్‌సీ) ప్రోబా-3 జీవితకాలం రెండేళ్లు కాగా.. వ్యయం 1800కోట్లు. ఆకల్టర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ బరువు: 200 కిలోలు, కరోనాగ్రాఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ బరువు: 340 కిలోలు. అయితే ఈప్రయోగంలో ఐరోపాదేశాలతో పాటు కెనడా కూడా భాగస్వామపక్షంగా ఉంది. సౌర కరోనాలో ఉష్ణోగ్రతలు 20 లక్షల డిగ్రీల సెల్సియస్‌ వరకూ చేరుకుంటాయి. సూర్యుడిలో తరచూ జరిగే మార్పులు, సౌర తుపాన్లు, సౌర జ్వాలల విడుదల వంటి పరిణామాల వెనుక కరోనా పాత్ర కీలకం. ఇవి అంతరిక్ష వాతావరణంపై ప్రభావం చూపుతాయి. వీటివల్ల భూమిపై విద్యుత్‌ గ్రిడ్‌లు, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, నేవిగేషన్‌ వ్యవస్థల సేవలకు అవరోధం కలగొచ్చు.

సంప్రదాయ సాధనాలతో సౌర కరోనాను పరిశీలించడం చాలా కష్టం. ఎందుకంటే.. సూర్యుడి తేజస్సు ముందు కరోనా వెలవెలబోతుంది. భానుడి వెలుగులు.. కరోనాలోని ప్రకాశవంతమైన ప్రాంతం కన్నా ఏకంగా 10 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణాల సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యగోళాన్ని కప్పేసినప్పుడు కరోనా కనిపిస్తుంది. అయితే ఆ పరిణామాలు చాలా అరుదు. పైగా అవి కొద్దినిమిషాల పాటే కొనసాగుతాయి. భూమి మీద నుంచి ప్రయోగించేటప్పుడు ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. ఈ వ్యోమనౌకను భూమి చుట్టూ ఉన్న 600× 60,530 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. అక్కడ రెండు ఉపగ్రహాలు విడిపోతాయి.ఈ రెండు ఉపగ్రహాలు తమ కక్ష్యలో ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేయడానికి 19 గంటల 36 నిమిషాల సమయాన్ని తీసుకుంటాయి.

కక్ష్యలో భూమికి సుదూరంగా ఉండే బిందువు (60,530 కిలోమీటర్ల దూరం)లోకి రాగానే అవి ఒక నిర్దిష్ట పద్ధతి (ఫార్మేషన్‌ ఫ్లయింగ్‌)లో విహరించేలా ఆదేశాలు వెళతాయి. ఆ సమయంలో వాటి మధ్య దూరం 150 మీటర్లు ఉంటుంది. సెకనుకు 1 కిలోమీటరు వేగంతో పయనిస్తుంటాయి. ఈ సర్దుబాటును ఉపగ్రహాలు సొంతంగానే చేసుకుంటాయి. ఇందుకోసం వాటిలో అధునాతన నేవిగేషన్, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ దశలో ఓఎస్‌సీ ఉపగ్రహం.. సూర్యుడి వైపు ఉంటుంది. ఇందులో 1.4 మీటర్ల వెడల్పైన ఆకల్టింగ్‌ డిస్క్‌ ఉంటుంది. అది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక నీడను ఏర్పరుస్తుంది.ఈ నీడలో సీఎస్‌సీ ఉపగ్రహం విహరిస్తుంది. అందులోని టెలిస్కోపులో ఉన్న అపెర్చర్‌.. నిర్దిష్టంగా 8 సెంటీమీటర్ల వెడల్పున్న నీడలోనే ఇమిడిపోతుంది.

ఫలితంగా దాని దృక్కోణంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినట్లవుతుంది. సౌర బింబం వెలుగులు ఆ టెలిస్కోపు మీద పడవు. భానుడి చుట్టూ ఉన్న కరోనాను అది స్వేచ్ఛగా వీక్షించగలుగుతుంది. విస్పష్ట ఫొటోలు తీయగలుగుతుంది. ఈ ప్రక్రియ 6 గంటల పాటు సాగుతుంది. అంతసేపు మిల్లీమీటరు స్థాయిలో కూడా తేడా రాకుండా పూర్తి సమన్వయంతో ఈ రెండు వ్యోమనౌకలు విహరించాలి. ఆరు గంటల తర్వాత.. రెండు ఉపగ్రహాలు ‘ఫార్మేషన్‌ ఫ్లయింగ్‌’ స్థితి నుంచి బయటకు వస్తాయి. వేర్వేరుగా కక్ష్యలో భూమికి చేరువగా ఉండే బిందువు దిశగా పయనిస్తాయి. కరోనాపై నాణ్యమైన పరిశోధనలకు ఇది వీలు కల్పిస్తుంది. భవిష్యత్‌లో కక్ష్యలోని పాత ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, ఇతర గ్రహాల నుంచి నమూనాలు తీసుకురావడానికి ప్రోబా-3 సాంకేతికతలు ఉపయోగపడతాయి.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :