ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను సీఎం రేవంత్ భయపెడుతున్నాడు: జగదీశ్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వికారాబాద్‌లో అధికారులపై జరిగిన దాడితో రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్న ఆయన.. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ ఇంతకాలం సీఎం టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయారని ఒకపక్క చెప్తూనే... పదేపదే కేసీఆర్‌ను తలుచుకొని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎలాగైనా ఎవరూ తెచ్చుకోలేనంత చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో? అని వెటకారం ఆడారు. అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, మేధావులు వెళ్లి అసలు విషయం తెలుసుకోవాలని జగదీశ్ రెడ్డి సూచించారు. అలాగే ఢిల్లీకి రేవంత్ రెడ్డి 25 సార్లు వెళ్లారని చెప్పిన ఆయన.. అక్కడ రేవంత్ ఎవరి కాళ్లు మొక్కారో చెప్పాలంటూ చురకలేశారు. అదే సమయంలో తమ నేత కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోవాలని సలహా ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని స్పష్టం చేశారు.