Adani - Jagan : అదానీ లంచాల వ్యవహారం.. వైసీపీ వాదనలో డొల్లతనం..!!
దేశమంతా ఇప్పుడు అదానీ లంచాల వ్యవహారంపైనే చర్చ జరుగుతోంది. మన దేశ బాగోతం ప్రపంచవ్యాప్తమైందని అదానీ వ్యతిరేక పార్టీలన్నీ కోడైకూస్తున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కు లంచాలు ముట్టినట్లు అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆరోపించింది. అయితే అసలు తమకు ఈ లంచాలతో సంబంధమే లేదని వైసీపీ వాదిస్తోంది. తాము కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – సెకీతో ఒప్పందం చేసుకున్నామని.. అదానీ సంస్థతో కాదని చెప్తోంది. అదానీతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని వాదిస్తోంది. అయితే తాము తెలివిగా వ్యవహరిస్తున్నామని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇందులోనే ఆ పార్టీ డొల్లతనం బయటపడుతోంది.
2021లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడ సెకీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. యూనిట్ ను రూ.2.49కి కొంటామని డీల్ కుదుర్చుకుంది. వాస్తవానికి సెకీ అనేది విద్యుత్ ఉత్పత్తి చేయదు. దేశంలో ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్ ను ఆయా రాష్ట్రాలకు అమ్ముతుంది. అలాగే అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్ ను సెకీ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. వాస్తవానికి అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన సోలార్ పవర్ ధర ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో ఏ రాష్ట్రమూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఇక్కడే అసలు వ్యవహారం నడిచింది. ఏ రాష్ట్రమూ ముందుకు రాని సమయంలో జగన్ తానున్నానంటూ ముందుకొచ్చి డీల్ కుదుర్చుకున్నారు.
జగన్ సెకీతో డీల్ కుదుర్చుకునే ముందు అదానీతో పలుమార్లు సమావేశమయ్యారు. తాము సెకీకి విక్రయించే విద్యుత్ ను కొనుగోలు చేస్తే ఒక్కో మెగా వాట్ కు రూ.25లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేసినట్లు FBI ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మొత్తం 7వేల మెగావాట్లకు గానూ రూ.1750 కోట్లు అదానీ ఆఫర్ చేసినట్లు తెలిపింది. అదానీతో జగన్ ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాతే సెకీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి జగన్ ఈ డీల్ కుదుర్చుకోకుండా ఉండే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మూతపడేది. ఎందుకంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ సామర్థ్యం 8వేల మెగావాట్లు. ఇందులో 7వేల మెగావాట్ల విద్యుత్ ను సెకీ ద్వారా కొనేందుకు జగన్ డీల్ కుదుర్చుకున్నారు. దీని విలువ దాదాపు లక్ష 5వేల కోట్లు. ఈ డీల్ వల్ల తమ అదానీకి 16వేల కోట్ల రూపాయల లాభం వస్తాయని అంచనా. అందులో రూ.1750 కోట్లను జగన్ కు ఆఫర్ చేశారనేది అమెరికా చెప్తున్న మాట.
కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు, అదానీకీ సంబంధమే లేదని.. కేవలం సెకీతో మాత్రమే డీల్ కుదుర్చుకున్నామని వాదిస్తోంది. సెకీతో డీల్ కుదుర్చుకుంటే అదానీ ఎందుకు డబ్బులు ఆఫర్ చేశారనేదానికి సమాధానం లేదు. డీల్ కు ముందు జగన్ తో అదానీ ఎందుకు సమావేశమయ్యారనేదీ చెప్పట్లేదు. అంతేకాదు.. 2016లో చంద్రబాబు రూ.4.50 పెట్టి విద్యుత్ కొంటే తాము కేవలం రూ.2.49కే కొంటున్నట్టు చెప్తోంది. అయితే సోలార్ ధరలు ఏటికేడాది భారీగా పడిపోతున్నాయి. ఇదే సెకీ నుంచి గుజరాత్ రూ.1.99కే విద్యుత్ కొంటోంది. మరి వైసీపీ ఎందుకు రూ.2.49తో ఈ డీలు కుదుర్చుకుందనేదానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. మొత్తంగా అదానీ ఇష్యూలో వైసీపీ వాదన మరీ పేలవంగా ఉంది. తాము ఏం చెప్పినా నమ్మేస్తారనుకోవడం ఆ పార్టీ అమాయకత్వం. పైగా అమెరికా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటాయి. అన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఇది ఛార్జ్ షీట్ వరకూ వెళ్లింది. అరెస్టుకు సమన్లు కూడా జారీ అయ్యాయి. డైరెక్టుగా ఏపీ సీఎం అని ప్రస్తావించింది కూడా. అయినా వైసీపీ ఇలా వాదించడం విడ్డూరంగా ఉంది.