ASBL NSL Infratech

తెలంగాణ రాజకీయాలపై జనసేన ఫోకస్... తెలంగాణ గట్టుమీద జనసేన..

తెలంగాణ రాజకీయాలపై జనసేన ఫోకస్... తెలంగాణ గట్టుమీద జనసేన..

ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా జనసేనాని పవన్ వేసిన అడుగులు ఫలితాన్నిచ్చాయి. ఏకంగా 21 స్థానాలకు గానూ 21 స్థానాల్లో గెలిచి 100 స్ట్రైక్ రేటు సాధించింది జనసేన. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇక ఆయన దృష్టి తెలంగాణపై పడింది. ఏపీలో టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తెచ్చి వైసీపీ పతనాన్ని శాసించిన పవన్.. ఇప్పుడు తెలంగాణలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఆయ‌న రాజ‌కీయంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు.

తాము తెలంగాణలో నూ విస్త‌రిస్తామ‌ని.. జ‌న‌సేనను బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు పవన్. అంతేకాదు.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఓడిపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ.. త‌ప్పులు జ‌రిగి ఉంటే వాటిని స‌రిచేసుకుంటామ‌ని చెప్పారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో బీజేపీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి బండిసంజయ్.. పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు. తామే ముందుగానే జ‌న‌సేన‌తో చేతులు క‌లిపామ‌ని.. అయితే..ఇప్పుడు జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లే విష‌యాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంద‌న్నారు. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎవ‌రితోనైనా చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి.. బీజేపీ కూడా జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతుంద‌నేది తెలుస్తోంది.

జనసేనతో కలిసి నడిచేందుకు తెలంగాణ బీజేపీ నేతలకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ టీడీపీతో అంటే కష్టమే అన్న భావన వినిపిస్తోంది. టీడీపీని ఫక్తు ఆంధ్రపార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి అక్కడి పార్టీలు. మరి ఇలాంటి సందర్భంలో టీడీపీతో కలిస్తే తమకు ఎలాంటి లాభం కలగకపోగా.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ లాభపడే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీనికి తోడు 8 ఎంపీలను గెల్చుకున్న బీజేపీ.. తర్వాతి ఎన్నికల్లో తనదే అధికారం అన్న ధీమాతో ఉంది. ఈసందర్భంగా పవన్.. టీడీపీని కూటమిలో చేర్చేందుకు ప్రయత్నించినా... బీజేపీ అంగీకరిస్తుందన్న పరిస్థితి కనిపించడం లేదు.

మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చి ఊపుమీదున్న టీడీపీ.. తెలంగాణలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టనుంది. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం ప్రస్తావించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పతనావస్థలో ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం గట్టి లీడర్లు అనేవారిని కాంగ్రెస్ లాగేస్తోంది. మరికొందరు కాంగ్రెస్ లోకి పోలేక కమలం వైపు చూస్తున్నారు. ఆ రెండింటిలో ఇమడలేం అనుకున్న వ్యక్తులు.. సైకిల్ వైపు చూస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. గతంలోలాగ టీడీపీని ఇప్పుడు ఆంధ్రపార్టీ అనే పరిస్థితి లేదన్నది సదరు నేతల భావనగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ ఒంటరిగా బరిలో దిగే అంశాన్ని తోసిపుచ్చలేం. మరి పవన్ ఎలాంటి ఫార్ములా అవలంభిస్తారో వేచి చూడాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :