ASBL Koncept Ambience
facebook whatsapp X

జార్ఖండ్ బాద్షా హేమంత్ సొరెన్..

జార్ఖండ్ బాద్షా హేమంత్ సొరెన్..

ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి మరోసారి విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. ఎన్డీఏ కూటమి మరోసారి విపక్షానికే పరిమితమైంది.పేరుకు ఇండియా కూటమి అయినప్పటికీ.. ప్రచార పర్వాన్ని అంతటినీ భుజాన వేసుకుని, హేమంత్ సొరెన్ ముందుకు నడిపించారు. ఎక్కడ, ఎలాంటి వ్యూహం అవసరమన్న అంశంపై పూర్తి క్లారిటీతో ఉన్న హేమంత్.. ఎన్డీఏకు గట్టిషాక్ ఇచ్చారు.

హేమంత్ సొరెన్ అరెస్టే కొంపముంచిందా...?

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఓ అవినీతి కేసులో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. ఈ విషయాన్ని రాజకీయ కుట్రగా ఆరోపిస్తూ ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగించుకుంది. హేమంత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత హేమంత్‌, కల్పనాలు కలిసి దాదాపు 200 సమావేశాలను నిర్వహించారు. దీనికి తోడు మహిళలకు నెలకు ఇచ్చే వెయ్యి రూపాయలను రూ.2500కు పెంచడం వంటి పథకాలు కలిసి వచ్చాయి. 'సర్నా'ను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

హేమంత్ సోరెన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని అనే అంశాలను బీజేపీ ఎన్నికల ప్రచారాల్లో ప్రధానంగా ప్రస్తావించింది. హేమంత్‌ అరెస్టు నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టిన చంపయీ సోరెన్‌ బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన బీజేపీలో చేరిపోయారు. హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ కూడా కాషాయ కండువా కప్పుకోవడం జేఎంఎంకు ఎదురుదెబ్బగా మిగిలింది. చంపయీ సోరెన్ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ ఫలితాల్లో మాత్రం బీజేపీకి నిరాశ తప్పలేదు.

ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయీకి ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి. ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13, 20తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 81 స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :