ASBL Koncept Ambience
facebook whatsapp X

మరోసారి ప్రజల్లోకి కేసీఆర్.. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం

మరోసారి ప్రజల్లోకి కేసీఆర్.. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం

తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు కవిత విడుదలవటంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు.. రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్.. క్షేత్రస్థాయిలో ఆందోళనలు కూడా చేసింది. కాగా.. స్వయంగా రైతు అయిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా.. అన్నదాతల కోసం రంగంలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.

కాగా.. ఇప్పుడు తన కుమార్తె కవిత కూడా జైలు నుంచి విడుదలవటంతో.. రెట్టింపు ఉత్సాహంలో గులాబీ బాస్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాష్టంలో పూర్తిస్థాయి రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటానికి కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సభలు లేదా కార్నర్‌ మీటింగ్‌లు పెట్టి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని.. ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇన్నాళ్లు తనయ కవిత జైల్లో ఉండడం, ఇతరత్రా సమస్యలు, ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని భావించిన కేసీఆర్.. కొన్నినెలలుగా మౌనం దాల్చారు. దీంతో బీఆర్ఎస్ పని అయిపోయిందని... విపక్షాలు సెటైర్లు వేస్తూ వచ్చాయి. దీనికి తోడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు.. కేడర్ ను గందరగోళంలోకి నెట్టాయి. ఈపరిస్థితుల్లో కేసీఆర్ యాత్రకు సిద్ధం కావడంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వంటి వాటితో బీఆర్ఎస్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. దీనికితోడు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉనికి కోసం బీఆర్ఎస్ పోరాడుతోంది.

పార్టీ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్నప్పటికీ పెద్దగా స్పందన రావడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ జిల్లాల పర్యటనకు రెడీ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి సైతం.. కేసీఆర్ యాత్రకోసం వేచి చూస్తున్నారు. సింహంబయటకు వస్తే చెట్టుకు కట్టేస్తామంటూ గతంలోనే ప్రకటనలు సైతం చేశారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు సాక్షాత్తూ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎక్కుపెట్టే విమర్శలకు .. రేవంత్ సర్కార్ ఎలాంటి కౌంటర్ ఇవ్వనుందో వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :