కెనడా సర్కార్ అండ.... ఖలిస్తానీ మద్దతుదారుల హింసాకాండ..
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి పేట్రేగారు. బ్రాంప్టన్ లోని హిందూసభ మందిర్ లో భక్తులపై దాడి చేశారు. ఈ ఘటన సమయంలో మందిర్ లో ఉన్న మహిళలు, పిల్లలపైనా దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కెనడియన్ ఎంపీలుసైతం పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆలయం వెలుపల ఖలిస్థానీ అనుకూల గ్రూపులతో సంబంధం ఉన్న జెండాలను ప్రదర్శించడంతోపాటు కర్రలతో కొందరు వ్యక్తులు చిన్నారులు, మహిళలపై కూడా దాడి చేస్తున్న దృశ్యాలు కలకలం రేపాయి.ఈ ఘటన విషయం తెలుసుకున్న కెనడియన్ పోలీసులు భారీ సంఖ్యలో మందిర్ వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. కెనడియన్లందరికీ తమ విశ్వాసాన్ని సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి భక్తులను రక్షించారని, ఈ ఘటనపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఈ ఘటనను కెనడా పార్లమెంట్ లో ప్రతిపక్షనేత పియరీ పోయిలీవ్రే, ఎంపీలు కెవినక్ష్ వూంగ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి చర్య ప్రమాదకరమైన తీవ్రవాదంగా అభివర్ణించారు.
కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదం ఎంత హింసాత్మకంగా మారిందో ఈ ఘటనను బట్టి అర్ధం అవుతుంది. వారు రెడ్ లైన్ దాటారు. కెనడాలోని భావప్రకటనా స్వేచ్ఛ చట్టాలను ఖలిస్థానీ తీవ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. వీటన్నింటికీ ఉచిత పాస్ లు పొందుతున్నారని చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశాడు.