ఇస్లామిక్ అతివాదం పిడికిలిలో బంగ్లాదేశ్.. ఇస్కాన్ గురువు చిన్మయ్ ప్రభు అరెస్ట్..
బంగ్లాదేశ్ ఇస్లామిక్ అతివాదం దిశగా అడుగులేస్తోంది. తమదేశంలో 90శాతం ముస్లింలు ఉన్నారు కాబట్టి.. తమదేశ రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించాలన్న డిమాండ్లకు అనుగుణంగా పాలన జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట మైనార్టీ హిందువులపై దేశవ్యాప్తంగా దాడులు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హిందూసంస్థలపైనే ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా ఇస్కాన్ గురువు చిన్మయ్ ప్రభు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది.దీన్ని దేశవ్యాప్తంగా హిందూ, బౌద్ధ మైనార్టీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇస్కాన్ గురువు చిన్మయ్‌ప్రభును దేశద్రోహం కేసు కింద బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అక్టోబర్ 30న చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగా చిన్మయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చిన్మోయ్ ను వెంటనే విడుదల చేయాలని ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
అదే సమయంలో ప్రధాని మోడీకి చిన్మయ్‌ప్రభును విడుదల చేసేలా ఒత్తిడి తేవాలంటూ విజ్ఞప్తి చేసింది. “ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణం” అని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని.. ఈ ఘటనపై తగిన చర్య తీసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది.
ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు చెప్పాలని కోరింది. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రధాని మోడీని ఉద్దేశించి ఇస్కాన్ సంస్థ చేసిన పోస్ట్ ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం, బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేశారు. బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం ఢాకాలోని హజ్రత్ షాజలాల్ విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు.