MLC Election: టీడీపీని టెన్షన్ పెడుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్..!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇటీవలే విజయనగరం స్థానిక సంస్థల ఉప ఎన్నికపై హడావుడి నడిచింది. అయితే హైకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్ ఆ ఉప ఎన్నికను రద్దు చేసింది. దీంతో ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి మళ్లింది. ప్రస్తుతం కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి నెలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉభయగోదావరి జిల్లాల ఎన్నికను మినహాయిస్తే కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం అధికార టీడీపీని కలవరపెడుతోంది.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి సీటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేనకు త్యాగం చేశారు. దీంతో ఆయన్ను ఎలాగైనా చట్టసభలకు పంపించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇంతలో కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రావడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన ఆదేశించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి ఆయన పేరును ఖరారు చేశారు. దీంతో ఆయన రెండు జిల్లాల్లో విస్తృతంగా తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు కూడా పూర్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఎలాగైన పట్టు సాధించాలని వైసీపీ మొదటు బాగానే హడావుడి చేసింది. ఆ పార్టీ నేత గౌతంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన కూడా ఓటరు నమోదుతో పాటు ప్రచారం కూడా చేపట్టారు. ఇంతలో ఏమైందో ఏమో.. హఠాత్తుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తమ పార్టీ తప్పుకుంటున్నట్టు వైసీపీ ప్రకటించింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటర్లు ముందుకొచ్చి ఓటేసే పరిస్థితి లేదని.. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఇందుకు ఆ పార్టీ కారణాలుగా చెప్పింది. వాస్తవానికి 2023లో జరిగిన మూడు పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉండగానే ఓడిపోయింది. ఈ మూడింటినీ టీడీపీ కైవసం చేసుకుంది.
వైసీపీ బరిలో నుంచి తప్పుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ నేత లక్ష్మణరావు తాను మళ్లీ బరిలో ఉంటున్నట్టు ప్రకటించారు. లక్ష్మణరావు ఇప్పటివరకూ 4 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికను టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్మణరావుకు వామపక్ష పార్టీల మద్దతు ఉంది. ఇప్పుడు వైసీబీ తప్పుకోవడంతో ఆ పార్టీ కూడా లక్ష్మణరావుకు అంతర్గతంగా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. లక్ష్మణరావును గెలిపించేందుకే వైసీపీ బరి నుంచి తప్పుకుందనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో టీడీపీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.