ASBL Koncept Ambience
facebook whatsapp X

త్వరలో కేటీఆర్ పాదయాత్ర... హస్తాన్ని కడిగేస్తానంటున్న యువనేత

త్వరలో కేటీఆర్ పాదయాత్ర... హస్తాన్ని కడిగేస్తానంటున్న యువనేత

గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో జోష్ సన్నగిల్లింది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తనదైన వ్యూహాలతో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేస్తున్నారు. దీంతో ఆపార్టీ రెండడుగులు ముందుకేస్తే.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. పార్టీ చీఫ్ కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. అడిగినప్పుడల్లా అదిగో.. ఇదిగో అనడం తప్పా , మరో అప్ డేట్ ఉండడం లేదు. ఇక విమర్శలపై కౌంటర్లతో కేటీఆర్, హరీశ్ రావు కాలం గడిపేస్తున్నారు. మధ్యలో కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు హడావుడి చేయడం తప్పా పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నెటిజన్లతో సంభాషించిన కేటీఆర్…పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు.బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుతం తమ బాధ్యతని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారని.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై తమ సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. 2025లో కేసీఆర్ జనంలోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.. హామీలపై ఈ ప్రభుత్వానికి కావాలనే ఒక సంవత్సరం సమయం ఇచ్చామన్నారు.

2025లో కాంగ్రెస్ హామీలపై ప్రభుత్వాన్ని కేసీఆర్ నిలదీస్తారని చెప్పారు.ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకునే రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :