మంత్రి పొంగులేటికి ‘బాంబుల శాఖ’ అని పెట్టండి.. కేటీఆర్ ఎద్దేవా!
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాఖ ఏదో నాకు తెలియడం లేదు. కానీ ఆయనకు 'బాంబుల శాఖ' అని పెట్టండి. ఎందుకంటే ఈ బాంబు పేలుతుంది,. ఆ బాంబు పేలుతుందని అంటున్నారు కదా. మరి ఏ బాంబు పేలి కాంగ్రెస్లో ఎవరు ఎగిరిపోతారో ఆయనకే ఎరుక. మాకు ఆ విషయాలు తెలియవు. కానీ ఒకటి మాత్రం పక్కా. వాళ్లని మాత్రం వదిలిపెట్టం. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతుంది. అందుకని వారోత్సవాలు, విజయోత్సవాలు చేయాలట. వీళ్లేదో పీకి పందిరేశారట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు. అవసరమైతే మేము కూడా పార్టీలో చర్చించి, కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాల వారోత్సవం చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేశారో లెక్కలు చెప్తాం. పాదయాత్రలు, మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి’ అని కేటీఆర్ తెలిపారు.