KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా..!? ఆయన మాటేంటి..!?
తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అరెస్టు కాబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని.. ఈ మేరకు గవర్నర్ కు ఓ లేఖ రాసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తన అరెస్టుపై వస్తున్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. తానే తప్పూ చేయలేదని.. ఒకవేళ ప్రభుత్వం అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చని సూచించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేసింగ్ ను నిర్వహించింది. అందుకోసం ప్రభుత్వం అక్రమంగా రూ.55 కోట్ల రూపాయలను HMDA నుంచి చెల్లించిందనే ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ఆ డబ్బు చెల్లించినట్లు నాటి అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో వెల్లడించారు. అయితే అలా చెల్లించడం అక్రమమనేది ఏసీబీ చెప్తున్నమాట. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. బాధ్యులైన వాళ్లందరినీ విచారిస్తోంది. అందులో భాగంగానే త్వరలో కేటీఆర్ ను కూడా విచారణకు పిలిచి అరెస్టు చేయవచ్చనేది తాజా వార్త.
దీపావళి నాటికి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలతాయని కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తూ వస్తున్నారు. ఇది కచ్చితంగా కేటీఆర్ అరెస్టే అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్న మాట. అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ ముందుంటోంది. హైడ్రా, మూసీ.. ఇలా అన్నింటినీ ఎత్తి చూపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ నోటికి ముకుతాడు వేయాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తే అంతా సెట్ అయిపోతుందనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది.
తన అరెస్టుపై వార్తలు వస్తుండడంతో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినట్లు చెప్పారు. 2003లో హైదరాబాద్ లో ఈ రేస్ నిర్వహించేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. ఈ రేస్ నిర్వహణ వల్ల హైదరాబాద్ ఇకో సిస్టమ్ డెవలప్ అయిందని.. దీని వల్ల రూ.700 కోట్లు లబ్ది చేకూరిందని కేటీఆర్ వివరించారు. ఇందుకోసమే నన్ను అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చని సూచించారు. తనను మూడు నెలలు జైల్లో పెడితే అక్కడ యోగా చేసుకుని ట్రిమ్ అవుతానన్నారు. ఆ తర్వాత బయటికొచ్చి పాదయాత్ర చేస్తానని వివరించారు.