ASBL Koncept Ambience
facebook whatsapp X

అరెరే... కేటీఆర్ కూడా పొరపడ్డారే..!!

అరెరే... కేటీఆర్ కూడా పొరపడ్డారే..!!

రాష్ట్రాల మధ్య పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు, వ్యాపార వాణిజ్య అంశాల పట్ల సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందింప జేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ప్రవేశ పెట్టింది. 2014లో మేకిన్ ఇండియా స్కీంలో భాగంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ఏ రాష్ట్రాలైతే వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయో.. అలాంటి రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటాయి. ఈ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఐదు సార్లు విడుదల చేసింది. 2015లో తొలిసారి ప్రకటించగా.. ఆ తర్వాత 2016, 2017, 2019లో వెల్లడించింది. తాజాగా 2022 సంవత్సరం ర్యాంకులను ప్రకటించింది. 2015లో తెలంగాణకు 13వ స్థానం దక్కింది. ఆ తర్వాత 2016లో ఫస్ట్ ర్యాంకు, 2017లో రెండో ర్యాంకు, 2019లో 3 ర్యాంకు దక్కించుకుంది. తాజా ర్యాంకుల్లో అసలు తెలంగాణ పేరే కనిపించకుండా పోయింది. ఇది విమర్శలకు తావిస్తోంది.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విడుదలైన ఈ ర్యాంకుల్లో తెలంగాణకు స్థానం దక్కకపోవడాన్ని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణకు స్థానం దక్కకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత వల్లే అని ట్వీట్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అగ్రస్థానంలో ఉండేదని.. ఆ ర్యాంకుల ఆధారంగానే కంపెనీలు వెల్లువెత్తాయని ఆయన తెలిపారు. అయితే కేటీఆర్ ఇక్కడే పొరపడ్డారని పలువురు విమర్శిస్తున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ర్యాంకులు 2022 నాటివి. అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. పైగా ఐటీ, పారిశ్రామిక రంగాన్ని కేటీఆరే చూస్తున్నారు. వాస్తవానికి అంతకుముందు తెలంగాణకు టాప్ ర్యాంకులు రావడానికి కేటీఆర్ ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి అన్ని చర్యలూ తీసుకున్నారు. అయితే 2022 నాటికి ఆ ర్యాంకును కాపాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయంలో గ్రహించని కేటీఆర్.. నెపాన్ని రేవంత్ రెడ్డి పైకి నెట్టేందుకు ప్రయత్నించారు. అరే.. కేటీఆర్ కూడా పప్పులో కాలేశారే.. అని అందరూ అనుకుంటున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :