తెలంగాణలో ఆర్‌ఎస్ బ్రదర్స్ పాలన : కేటీఆర్
తెలంగాణలో ఆర్‌ఎస్ బ్రదర్స్ ( రేవంత్, బండి సంజయ్ ) పాలన సాగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. పదవీ త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తే, ఎందరో బలిదానాల వల్ల రాష్ట్రం వచ్చింది. రాజకీయంలో ఎత్తు పల్లాలు సహజం. అనుకోకుండా అడ్డగోలుగా మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఎవరిని అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని బాహటంగా చెబుతున్నారు. ఆరు గ్యారంటీలలో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు, అరాచకం బయట పెడతాం. ఎవరికీ భయపడేది లేదు. బీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేరు. అన్నీ రాసుకుంటున్నాం. తిరిగి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది అని అన్నారు.