ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : దీపావళికి లక్ బాంబ్ పేల్చిన 'లక్కీ భాస్కర్'

రివ్యూ : దీపావళికి లక్ బాంబ్ పేల్చిన 'లక్కీ భాస్కర్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్,
నటీనటులు : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, మానస చౌదరి, రాంకీ, టిన్ను ఆనంద్, సాయి కుమార్, కసిరెడ్డి, శ్రీనాథ్, రిత్విక్,భాస్కర్, హైపర్ ఆది, శివన్నారాయణ,సచిన్ కేడ్ఖర్, పీ. సాయి కుమార్, తదితరులు నటించారు.
సంగీతం :జి వి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి,
ఎడిటర్ : నవీన్ నూలి, నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య,
రచన, దర్శకత్వం : వెంకీ అట్లూరి
విడుదల తేదీ : 31.10.2024
నిడివి : 2 గంటల 30 నిముషాలు  

వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగులో "మహానటి", "సీతా రామం" వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, తన తదుపరి చిత్రం కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి, (Venki Atluri) మరియు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments)తో 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar) గా దీపావళి పండగ రోజున తన లక్ కోసం థియేటర్లలోకి వచ్చాడు. మరి ఎంతో ఆసక్తి రేపిన ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్ధాం.

కథ:

ఇక కథలోకి వస్తే.. 1990 దశకంలో సెట్ చేయబడిన ఈ కథలో భాస్కర్ (దుల్కర్ సల్మాన్) మగధ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, ఇంటి నిండా అప్పులతో జీవితం గడుపుతుంటాడు. తమ్ముడు, చెల్లి, నాన్న, భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు అంటూ ఇలా అందరినీ భాస్కర్ చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఇక బ్యాంక్‌లో బెస్ట్ ఎంప్లాయ్‌గా ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుంటాడు. అంత చేసినా ఆశించిన జీతం, ప్రమోషన్స్ ఉండవు. ఒక వైపు అప్పు ఇచ్చిన వాళ్లు మీదకు వస్తుంటారు. ఇంటా, బయట భాస్కర్ అవమానాలను ఎదుర్కొంటూనే ఉంటాడు. అలాంటి టైంలో తన కుటుంబం కోసం ఎంతవరకు అయినా వెళ్లగలిగే భాస్కర్ కి డబ్బు సంపాదించడం అనేది ఒక అవసరం అని గ్రహిస్తాడు.  ఈ క్రమంలో భాస్కర్‌‌కు ఆంటోని (రాంకీ) ద్వారా ఓ ఆట (స్మగ్ల్డ్ గూడ్స్) అలవాటు అవుతుంది. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అక్కడితో ఆగని భాస్కర్ హర్షద్ మెహతా బ్యాంక్ స్కాములో భాగం అవుతుంటాడు. తనకు తెలిసిన, వచ్చిన జూదాన్ని తెలివిగా ఆడతాడు. సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో వంద కోట్లు చూసి సీబీఐ ఆఫీసర్ కూడా షాక్ అవుతాడు? అసలు అన్ని కోట్లు భాస్కర్ ఎలా సంపాదిస్తాడు? డబ్బు సంపాదనలో పడ్డ భాస్కర్‌ కుటుంబాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాడు? ఈ క్రమంలో తను చేసిన మైండ్ గేమ్ ఏ రేంజ్ లో ఉంది? డబ్బు వల్ల తను నష్టపోయాడా? లాభ పడ్డాడా అనే లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.  

నటీనటుల హావభావాలు :

దుల్కర్ సల్మాన్ పర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లుక్స్‌తోనూ, నటనతో దుల్కర్ అదరగొట్టాడు. లేడీ ఫ్యాన్స్‌కి అయితే దుల్కర్ ఓ ట్రీట్‌లా అనిపిస్తాడు. ఓ పక్క  ఫ్యామిలీ మెన్‌గా, మరో పక్క కామన్ మెన్‌గా దుల్కర్ తన నటనతో అదరగొట్టేస్తాడు. సుమతి లాంటి భార్య ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేలా మీనాక్షి చౌదరి నటించింది. అలాగే నటుడు రాంకీ, టిన్ను ఆనంద్, సాయి కుమార్,  కసిరెడ్డి, శ్రీనాథ్, రిత్విక్, శివన్నారాయణ, ఇంకా ఇతర ముఖ్య నటులు కొడుకుగా నటించిన చిన్న పిల్లాడు ఇలా అన్ని పాత్రలు బాగానే ఉంటాయి.తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

ఇక టెక్నికల్‌గా చూసుకుంంటే వెంకీ బ్రిల్లియెన్స్ కనిపిస్తుంది. ప్రతీ చిన్నదాన్ని ఎంతో డీటైలింగ్‌గా చూపించాడు. మరీ ముఖ్యంగాను కథను చెప్పిన తీరు, రాసుకున్న స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. 90వ దశకాన్ని బాగానే చూపించారు. సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ బాగుంది. క్యాస్టూమ్స్ కూడా అప్పటి కాలంలోకి తీసుకెళ్తాయి. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంది. పాటలు అంతగా గుర్తు పెట్టుకునేలా అయితే ఉండవు. ఇక మాటలు మాత్రం గుండెల్ని తాకుతాయి. డబ్బు సంపాదించడం అవసరం.. ఇప్పుడు వ్యసనం అంటూ తండ్రి చెప్పే డైలాగ్.. జూదం ఎంత గొప్పగా ఆడావ్ అన్నది కాదు.. ఎప్పుడు ఆపాం అన్నది ముఖ్యం అంటూ చెప్పే డైలాగ్స్ బాగుంటాయి.  మెయిన్ గా వింటేజ్ సెటప్ ని అంతా చాలా బాగా చూపించారు. ఆ సెట్టింగ్స్ అంతా చాలా నాచురల్ గా ఉన్నాయి. అలాగే సినిమాలో ప్రతీ నటీనటులు వేషధారణ అప్పటి సామగ్రి విషయంలో దర్శకుడు విజన్, ఆర్ట్ రంగం జాగ్రత్తలు కనిపిస్తాయి. అలాగే సినిమాటోగ్రఫి పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. మెయిన్ గా జీవి ప్రకాష్ మ్యూజిక్ సాలిడ్ లెవెల్లో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. డబ్బు ప్రధాన ఎలిమెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. నిర్మాణ పరంగా సితార స్థాయి తెలుస్తుంది.

విశ్లేషణ: 

వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్, చూపించిన కథ కొత్తదేమీ కాదు. సీనియర్ ఎన్టీర్ ధనమా? దైవమా?  ఆస్తిమూరెడు ఆశబారెడు, అనే సినిమాలు వచ్చిన కాలం నుంచి, అంతకు ముందు నుంచీ ఉంటుంది. డబ్బుంటేనే సంఘంలో మర్యాద ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాన్సెప్ట్‌తో ఇది వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో అడ్డదారిలో డబ్బు సంపాదించే భర్తను దూరంగా పెట్టడం, నిజాయితీగా ఉండాలని భర్తకు చెప్పే మంచి భార్య ఉంటుంది. డబ్బులు లేనప్పుడే ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఇలా డబ్బు సంపాదించే మార్గంలో పడి.. డబ్బులు వచ్చాక సంతోషం అనేది కరువైందని సుమతి పాత్రతో చూపిస్తాడు దర్శకుడు. ప్రతీ ఒక్క కామన్ మ్యాన్, నార్మల్ ఆడియెన్‌కు కనెక్ట్ అయ్యేలా సీన్లను రాసుకున్నాడు వెంకీ.మంచి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, కామెడీ, సస్పెన్స్ ఫ్యాక్టర్ లు అన్ని చాలా బాగున్నాయి. ఈ దీపావళికి అయితే 'లక్కీ భాస్కర్' లక్ వున్నట్లే... తప్పకుండా గెలిచి తీరినట్టే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ  'లక్కీ భాస్కర్' మెప్పిస్తాడు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :