మహారాష్ట్రలో మేనిఫెస్టో ప్రకటించిన మహా వికాస్ అఘాడి కూటమి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. తమ మేనిఫెస్టోలో ఎంవీఏ ప్రధానంగా 5 హామీలను వెల్లడించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టిసారిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రూ.3 లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. అలాగే రుణాలను చెల్లించిన రైతులకు రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. అదే విధంగా మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెలా రూ.3,000 అందిస్తామని చెప్పింది. లడ్కీ బెహన యోజన కింద ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500ను రెట్టింపు చేస్తామని తెలిపింది. డిగ్రీ లేదా డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో చేసినట్లుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఎంవీఏ పేర్కొంది. అలాగే 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ.500లకే ఏడాదికి 6 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని వాగ్దానం చేసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ కారిడార్, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నూతన ఇండస్ట్రీయల్ పాలసీ, 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.