మాజీమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై హత్యాయత్నం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వాహనంపై నాగ్‌పుర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన అనిల్ దేశ్‌ముఖ్.. అనంతరం కటోల్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్‌ఫాటా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే కటోల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు నాగ్‌పుర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దర్ వెల్లడించారు. అనిల్ దేశ్‌ముఖ్ గతంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రూ.కోట్లలో లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం కటోల్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు.