ఆ విషయంలో ఏపీని ఫాలో అవుతున్న మహారాష్ట్ర.. ఈ ట్రెండ్ మంచిదేనా?
తాజాగా జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశంలో అత్యంత ఉత్కంఠతను రేకెత్తించాయి. ఒకపక్క కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ ఆఘాడి.. మరోపక్క బీజేపీ నాయకత్వంలోని మహాయుతి బరిలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా మహాయుతి భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకుంది. అయితే ఇందులో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రాలో జరిగినట్టుగా అక్కడ కూడా రెండు విషయాలు చోటుచేసుకున్నాయి..
మొదటిది కేకే సర్వే.. ఆంధ్రాలో ఎన్నికల సమయంలో కేకే సర్వే చెప్పిన విధంగానే కూటమి విజయ డంకా మోగించింది. ఆంధ్రాలో కూటమికి 164 సీట్ల వరకు దక్కుతాయి అని చెప్పిన కేకే మహరాష్ట్రలో బీజేపీ కూటమికి 220కు పైగా సీట్లు దక్కుతాయని చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను మహాయుతి 233 సీట్లు దక్కించుకుంది.. కేవలం 49 సీట్ల తో మహా వికాస్ ఆఘాడి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే ఆంధ్రాలో లాగానే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది.
అవును మహారాష్ట్ర రాజకీయాలలో మొట్టమొదటిసారిగా ఇలా ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఉన్నారు. ఆంధ్రాలో ఎలాగైతే జగన్ ప్రతిపక్ష పార్టీ హోదాకి కావలసిన సీట్లు దక్కించుకోలేకపోయారు మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడి కూడా అదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం ప్రాంతాలలో కూడా అధికార పార్టీను ప్రజలు అందలం ఎక్కిస్తున్నారు. అయితే రాజకీయపరంగా గమనిస్తే ఇది సరియైనది కాదు అని కొందరు భావిస్తున్నారు. ఎప్పుడైనా పాలన ఏకపక్షం అయితే.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే.. నష్టపోయేది ప్రజలే అన్నది వారి వాదన. ప్రతిపక్షాలు లేకుండా మారుతున్న రాష్ట్రాలు ట్రెండ్గా మారకముందే ప్రజలు మేల్కొనకపోతే మునుముందు పరిస్థితులు మరింత జటిలంగా మారే అవకాశం కూడా ఉంది.