మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు ... ఇలాగైతే కష్టమే!
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయని, ఈ విషయంలో కఠిన క్రమశిక్షణ అవసరమన్నారు. కలిసికట్టుగా పోరాడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులను ఎలా ఓడించగలం? అని ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్న ఖర్గే ఈ ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో అందరం ఐక్యంగా ఉండాలి. ఇదే మన ఆయుధం. పార్టీ విజయమే తమ గెలుపు అని ప్రతిఒక్కరూ అనుకోవాలి. పార్టీ బలంపైనే మన శక్తి ఆధారపడి ఉంటుందని భావించాలి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పనితీరుతో నూతనోత్సాహంతో పునరాగమనం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం పార్టీ ఆశించినట్లుగా లేవు. ఇండియా కూటమి పార్టీలు నాలుగు రాష్ట్రాలకు గాను రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ మన పనితీరు ఆశించిన విధంగా లేదు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారుతుందన్నారు.