అమెరికా ఎన్నారై మన్నవ మోహనకృష్ణకు నామినేటెడ్ పోస్టు
అమెరికాలో వ్యాపార రంగంలో స్థిరపడిన మోహన్ కృష్ణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమాని. అమెరికా ఎన్నారై టీడిపిలో కీలక నేతగా వ్యవహరిస్తూ అగ్రరాజ్యంలో ఎన్నో తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగ పటిష్ఠతకు ఎనలేని కృషి చేశారు. అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాలలో ఒకటైన నాట్స్‌కు అధ్యక్షుడిగా పనిచేసిన మన్నవ మోహన కృష్ణ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఎపి టెక్నాలజీ సర్వీసెస్ కు చైర్మన్‌గా నియమించారు.
మన్నవ మోహన్ కృష్ణ ఇటీవలి ఎన్నికల్లో కూటమి విజయానికి ఎంతగానో కృషి చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అమెరికాలో నిధులు సేకరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్‌గా కొనసాగుతూ మోహన్ కృష్ణ నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణకు ఎంతో ఆప్తుడు అయ్యారు. నాట్స్ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుల కోసం ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాపారపరంగా విదేశాల్లో ఉన్నప్పటికీ తన స్వస్థలం గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు నిత్యం కృషి చేస్తున్నారు. రాష్ట్ర టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మన్నవ సేవలకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఎపి టెక్నాలజీ సర్వీసెస్ కు చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకం పట్ల పలువురు టిడిపి అభిమానులు, ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.