మదనపల్లి కేసు విషయంలో ఎవరిని వదిలేది లేదు.. మంత్రి అనగాని..
మంగళవారం నాడు కొనసాగిన ఏడవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మదనపల్లి ప్రభుత్వ దస్తావేజుల దహణం అంశం కీలక పాత్ర పోషించింది. ఈ కేసులో ఎవరున్నా వదిలేది లేదు అని అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేస్తే.. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించారు అంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి మదనపల్లి ఇష్యూ గురించి డిస్కషన్ ప్రారంభం కాగానే సభలో ఓ రేంజ్ లో గందరగోళం చోటుచేసుకుంది. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
మంగళవారం నాడు సభలో మదనపల్లి ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన టిడిపి సభ్యులు దీనికి సంబంధించి పలు రకాల ప్రశ్నలు లేవనెత్తారు. ఇక దీనిపై మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని.. ఓ సందర్భంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనితో ఫైర్ అయినా వైసీపీ నేతలు సభలో తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా విచారణ జరుగుతున్న కేసు విషయంలో వ్యక్తుల పేర్లు ప్రకటించడం సరికాదు అంటూ ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అంతేకాదు కేవలం ఇది సభ్యులపై బురద చల్లడం కోసం చేస్తున్నారని.. రికార్డుల నుంచి ప్రకటించిన వ్యక్తుల పేర్లు వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ కూడా చేశారు. అయితే విషయం మరి పెద్దది కావడంతో చైర్మన్ జోక్యం చేసుకొని సభ్యులను వారించడానికి ప్రయత్నించారు. మంత్రులు మాట్లాడేటప్పుడు వ్యక్తుల పేర్లు వెల్లడించకుండా మాట్లాడాలి అని కోరారు.
అయితే దీనికి రియాక్ట్ అయిన అనగాని.. తాను కేవలం సిఐడి దర్యాప్తులో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నానని.. మదనపల్లి ఇన్సూరెన్స్ లో మొత్తం 2400 లకు పైగా ప్రభుత్వ ఫైళ్ళకు నిప్పు పెట్టారని తెలియపరిచారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు.. అయితే ప్రమాదానికి కారణం అని చెప్పిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు కూడా అక్కడ ఎవరికీ కనిపించలేదు అని అనగాని అన్నారు.
అప్పటివరకు పని చేసిన సీసీటీవీ కెమెరాలు కూడా సరిగ్గా అదే సమయానికి పాడైపోవడం ఇది కుట్రపూరితమైన ఘటన అన్న అనుమానాలని కలిగిస్తుంది అని అన్నారు. అలాగే మోటారు ఆయిల్ సంఘటన స్థలానికి దగ్గరలో ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది అని పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై సాగిన సిఐడి దర్యాప్తులో కొందరు మాజీ అధికారుల పేర్లు ప్రస్తావించడం జరిగిందని.. వీరందరూ కూడా మాజీమంత్రి అనుచరులుగా గుర్తింపు పొందిన వారే అని అనగాని వివరించారు. కేవలం తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సాక్షాలను తారుమారు చేయడానికి కొందరు కావాలని ఈ ఫైర్ డ్రామా సృష్టించారు అని అన్నారు.