దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు.. రైతులకు మంత్రి నాదెండ్ల హెచ్చరిక
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరు నియోజకవర్గం కొల్లూరు, ఈపూరు, కాప్రా, జంపని గ్రామాల్లో రోడ్ల వెంబడి ధాన్యం ఆరబోసిన రైతులతో ఆయన మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రవాణా కోసం లారీలు, గోనె సంచులు, కూలీలు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అనంతరం తెనాలి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. "ప్రతి జిల్లా నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రైతుల్లో భరోసా నింపేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వంలో ఇదే మిల్లుకి రైతులు తమ ధాన్యం అమ్మాలని నిబంధన ఉండేది. ఈ నిబంధన తొలగించాం. ఇకపై రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకునే సౌకర్యం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేశాం. గతేడాది వైసీపీ ప్రభుత్వం చేసిన కొనుగోలుతో పోల్చుకుంటే 100 శాతం కొనుగోలు పెరిగింది. రైతు నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే 24 గంటల నుంచి 30 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమవుతుంది’’ అని ఆయన తెలిపారు.