ఏఐ రంగానికి పెద్దపీట ... మరో నాలుగైదు నెలల్లో : మంత్రి శ్రీధర్‌బాబు
ఏఐ రంగానికి పెద్దపీట వేస్తున్నామని, మరో నాలుగైదు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీని నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గ్లోబల్ లాజిక్ సాఫ్ట్‌వేర్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తగిన తోడ్పాటునందిస్తోంది. బహుళజాతి కంపెనీలే కాకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12 శాతానికి చేరాయి. వచ్చే ఐదేళ్లలో 20 శాతానికి ఐటీ ఎగుమతులను పెంచేలా ప్రణాళిక రూపొందించాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. మలేసియాలోని తెలుగువాళ్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు అని తెలిపారు.