Kavitha: మళ్లీ యాక్టివ్ అవుతున్న కవిత..! ఇక్కడే పెద్ద ట్విస్ట్..!!
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఘనత ఏంటో అందరికీ తెలుసు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు-కేసీఆర్ తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టి ఉద్యమించారు. టీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ఆయన చేరుకున్నారు. అనేక పోరాటల అనంతరం ప్రత్యేక రాష్ట్రాన్ని సాదించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కేసీఆర్ పిల్లలు కేటీఆర్, కవిత కూడా రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు కావడం.. జైలుకెళ్లడం.. జరిగాయి. ఆ తర్వాత బెయిల్ పై జైలు నుంచి విడుదలైనా కవిత మాత్రం ఎక్కడా పాల్గొనలేదు.
కానీ ఇప్పుడు కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత నిందితురాలిగా ఉన్నారు. ఆమెను సీబీఐ, ఈడీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించాయి. జైల్లో దాదాపు వంద రోజులకు పైగా ఆమె ఉన్నారు. చివరకు బెయిల్ రావడంతో బయటికొచ్చారు. అయినా ఆమె ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వాస్తవానికి ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా బయటకు రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ కార్యాలయానికి కూడా రాలేదు. పూర్తిగా కుటుంబానికి పరిమితమైపోయారు.
అయితే ఇప్పుడు అదానీ ముడుపుల వ్యవహారం బయటకు రావడంతో కవిత తొలిసారి ఎక్స్ వేదికగా స్పందించారు. మాకో న్యాయం.. అదానీకో న్యాయమా అని ప్రశ్నించారు. అదానీని ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీశారు. చాలాకాలం తర్వాత కవిత రాజకీయ ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కవిత మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పుడు అర్థమైంది. ఆ మరుసటి రోజే ఆమె తెలంగాణ జాగృతి కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. దాన్ని కూడా తన ఇంట్లోనే జరిపారు. బయటకు రాలేదు. అయితే శనివారం ఆమె ఇంటి గడప దాటి బయటికొచ్చారు. నిమ్స్ ఆసుపత్రిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన ఓ బాధితురాలిని పరామర్శించారు.
ఇలా వరుసగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం, ట్వీట్లు స్టార్ట్ చేయడంతో కవిత ఇకపై యాక్టివ్ గా ఉండబోతున్నారని అర్థమవుతోంది. అయితే ఆమె పార్టీ తరపున కాకుండా తెలంగాణ జాగృతి తరపున ఇవన్నీ చేస్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్ కు ఓ నివేదిక ఇస్తామని కవిత ట్వీట్ చేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినప్పుడు తెలంగాణ జాగృతి పేరును కూడా భారత జాగృతిగా మార్చారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ ఆమె తెలంగాణ జాగృతిగానే పిలుస్తున్నారు. అంతేకాక.. ఆమె బీసీ నినాదాన్ని ఎత్తుకున్నట్టు అర్థమవుతోంది. మొత్తానికి చాలా నెలల తర్వాత కవిత బయటికొచ్చారు. రాజకీయాలు మొదలు పెట్టారు.