ASBL Koncept Ambience
facebook whatsapp X

జగన్‌ పార్టీకి కొత్త సలహాదారుడు..!! పార్టీలోనే ఆశ్చర్యం..!!?

జగన్‌ పార్టీకి కొత్త సలహాదారుడు..!! పార్టీలోనే ఆశ్చర్యం..!!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ వైసీపీకి సేవలందించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఐప్యాక్ తో వైసీపీ బంధం ఆ తర్వాత కూడా కొనసాగించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐప్యాక్ అన్నీ తామై వ్యవహరించింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఐప్యాక్ వ్యూహాలు ఫలించలేదు. పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది.

2019 ఎన్నికల్లో ఘన విజయం సాదించిన పార్టీ.. 2024 నాటికి దారుణంగా ఓడిపోవడంపై పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.. మధ్యలోనే సేవల నుంచి తప్పుకున్నారు. ఆయన శిష్యబృందం ఐప్యాక్ నడుపుతూ వచ్చింది. వాళ్లు చెప్పిన ప్రతి మాటా వింటూ వచ్చారు జగన్. చివరకు కేడర్ ను కూడా పట్టించుకోకుండా ఐప్యాక్ టీం చెప్పిన దానికి తలూపుతూ వచ్చారు. అందువల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఐప్యాక్ కు ఇచ్చిన గౌరవం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇవ్వలేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి కొత్త సలహాదారుడిని నియమించారు జగన్. పార్టీ నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాలిచ్చేందుకు ఆళ్ల మోహన్ సాయి దత్ అనే వ్యక్తిని నియమించుకున్నారాయన. దీంతో ఎవరీ మోహన్ సాయి దత్ అనే చర్చ మొదలైంది. ఈయన గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. గత 8 ఏళ్లుగా ఈయన పొలిటికల్ కన్సెల్టెంట్ గా పని చేస్తున్నారు. ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పట్టా పొందారు. చాలా చిన్న టీంతో ఈయన పొలిటికల్ కన్సెల్టెన్సీ సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణకు క్యాంపెయినింగ్ చేశారు. గతంలో SPARC అనే సంస్థలో పని చేశారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు పనిచేశారు. గతంలో లోకేశ్ కు వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

మోహన్ సాయి దత్ నియామకంపై వైసీపీలోనే మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంలో లోకేశ్ కు, ఇటీవల బీజేపీ అభ్యర్థులకు పనిచేసిన వ్యక్తిని జగన్ సలహాదారుడిగా నియమించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సలహాదారుల వల్లే పార్టీ దారుణంగా దెబ్బతిందని.. ఇప్పుడు మళ్లీ ఇలాంటి వాళ్లను తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఏంటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మోహన్ సాయి దత్ కు బీజేపీ హైకమాండ్ తో మంచి సంబంధాలున్నాయని.. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున సాయి దత్ ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటుందనే ఉద్దేశంతోనే జగన్ ఆయన్ను సలహాదారుడిగా నియమించుకున్నారనే టాక్ నడుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :