వాళ్లేమైనా సంఘ విద్రోహ శక్తులా? : ఎంపీ ఈటల
కాంగ్రెస్ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మాసిటీకోసం 19 వేల ఎకరాలు భూ సేకరణ చేసేందుకు ప్రయత్నించింది. ఫార్మాసిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఫోర్త్ సిటీకోసం 30 వేల ఎకరాలు అంటున్నారు. ఫోర్త్ సిటీ కోసం రైతుల పొట్ట కొడుతున్నారు. ఫార్మా సిటీ రద్దు అన్నారు. కొడంగల్‌లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు.
లగచర్లలో మా మీద దాడి జరగలేదని కలెక్టరే చెబుతున్నారు. అయినా, రైతులను నానా హింసలకు గురి చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్న వారిని గుర్తించి పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లగచర్ల రైతులు నక్సలైట్లా? వాళ్లేమైనా సంఘ విద్రోహ శక్తులా? నర్మదా, సబర్మతి నదుల్లాగే మూసీ అభివృద్ధి జరగాలి. అందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మూసీ ఇరువైపులా ఇళ్లను కూల్చి భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించ ే ప్రయత్నం జరుగుతోందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇచ్చిన హామీలు నెరుపుతున్నాయా? అనేది ముఖ్యమంత్రే చెప్పాలి. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎంకు ఉందా? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మీ మేనిఫెస్టో ఏమయ్యింది. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ ఇస్తామన్నారు ఇచ్చారా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఆటో డ్రైవర్లు, బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు ఏమైంది? రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది. రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారని సంబరాలు చేసుకుంటున్నారు అని ఈటల ప్రశ్నించారు.