ASBL Koncept Ambience
facebook whatsapp X

హసీనాను కట్టడి చేయాల్సిందే..భారత్ కు బంగ్లాదేశ్ పరోక్ష హెచ్చరికలు

హసీనాను కట్టడి చేయాల్సిందే..భారత్ కు బంగ్లాదేశ్ పరోక్ష హెచ్చరికలు

బంగ్లా దేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్.. క్రమంగా స్వరం పెంచుతున్నారు. భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు.. నోరుమూసుకుని ఉండాలంటూ వార్నింగిచ్చారు. భారత్ లో కూర్చుని రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు. అంతేకాదు.. హసీనాను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్ పైనే ఉందంటూ తేల్చిచెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపైనా ప్రభావం చూపిస్తాయన్నారు.‘బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అప్పగించాలని అడిగే వరకూ షేక్ హసీనా తమ దేశంలో ఉండాలని భారత్‌ భావిస్తే.. ఆమె మౌనంగా ఉండాలన్నది మా షరతు’ అని స్పష్టం చేశారు.

‘‘హసీనా భారత్‌లో కూర్చుని రాజకీయాలు మాట్లాడితే ఇబ్బందులు తప్పవు.. ఆమె మౌనంగా ఉంటే మేము పట్టించుకొనేవాళ్లమే కాదు.. ప్రజలు కూడా మరిచిపోయేవాళ్లు.... కానీ ఆమె మాట్లాడమే కాదు ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఇది మాకే కాదు భారత్‌కు మంచిది కాదు.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి.. ఆమె మాట్లాడకుండా ఉంచాలని మేం స్పష్టంగా చెప్పాం.. అయినా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని స్నేహపూర్వక సంకేతంగా భావించడం లేదు. సాధారణ పరిస్థితుల్లో హసీనా.. భారత్‌కు వెళ్లలేదు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో దేశం విడిచి పారిపోయారు.

ఆమెను వెనక్కి తీసుకొచ్చేంతవరకు బంగ్లా ప్రజలకు శాంతించరు.. అరాచకాలకు పాల్పడిన ఆమెపై అందరి ముందు విచారణ జరగాలి’ అని యూనుస్‌ వ్యాఖ్యానించారు. భారత్‌తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కానీ హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని మాత్రం విడనాడాలని పరోక్షంగా విమర్శించారు. ‘వారి ఆలోచన ఏమిటంటే అందరూ ఇస్లామిస్టులే.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఇస్లామిస్టులు.. అందరూ ఇస్లాంవాదులేనని, ఈ దేశాన్ని మరో ఆఫ్గనిస్థాన్‌గా మారుస్తారని అంటున్నారు.. బంగ్లాదేశ్ షేక్ హసీనా చేతుల్లో మాత్రమే సురక్షితంగా ఉంటుందని అభిప్రాయం... ఆ ధోరణి నుంచి భారత్ బయటకురావాలి. బంగ్లాదేశ్ కూడా ఇతర దేశాల మాదిరిగానే ఓ పొరుగు దేశం’ అని పేర్కొన్నారు.

అంతేకాదు, తమ దేశంలో హిందువులు సహా మైనార్టీలపై జరుగుతున్న హింసను కొట్టిపారేసిన యూనుస్.. రాజకీయ కారణాలతో జరుగుతున్న దాడులకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. అవామీలీగ్‌ నేతృత్వంలోని షేక్‌ హసీనాకు చాలా మంది హిందువులు మద్దతిచ్చారని, అందుకే దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులంటే అవామీలీగ్‌ మద్దతుదారుల కిందే లెక్క... అందుకే హింస జరుగుతోంది. ఇది సరైందని నేను చెప్పను. ఇదే అదనుగా కొందరు హిందువుల ఆస్తులను ఆక్రమించుకుంటున్నారు’’ అని యూనస్ స్పష్టం చేశారు. మరోవైపు.. బంగ్లాదేశ్ సైతం ఆఫ్ఘనిస్తాన్ బాటలో పయనిస్తుందేమో అని ప్రముఖ రచయిత్రి తస్లీమా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, హిందూత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని.. అతివాదులు ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :