ASBL NSL Infratech

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..! ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా..?

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..! ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ ఎత్తులు పైఎత్తులు అన్నట్టు సాగుతూ ఉంటుంది. టీడీపీ, వైసీపీ మధ్య ఈ గేమ్ దాదాపు పదేళ్లుగా సాగుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైఫల్యాలపైనే ఫోకస్ పెట్టింది. ఆయన ఏనాడూ మాటమీద నిలబడరని.. మేనిఫెస్టోను అమలు చేయకుండా మాయం చేస్తారని.. ఆయన్ను నమ్మి ఓట్లేస్తే ఇబ్బంది పడతారని విమర్శిస్తూ వచ్చింది. తాజా ఎన్నికల్లో కూడా సూపర్ సిక్స్ పేరుతో మభ్య పెడ్తున్నారని.. నమ్మొద్దని హెచ్చరిస్తూ వచ్చింది. అయితే వైసీపీ నేతల మాటలను ఏమాత్రం పట్టించుకోని జనం.. టీడీపీకి కనీవినీ ఎరుగని మెజారిటీ కట్టబెట్టారు.

గతంలో పలు సందర్భాల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను చంద్రబాబు నెరవేర్చలేదు. అప్పటి రాష్ట్ర పరిస్థితులు కావచ్చు.. లేదంటే ఇంకేదైనా కారణం ఉండొచ్చు.. వాటిని అమలు చేయలేక పలు సందర్భాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రధానంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇందులో పలు వర్గాలను ప్రసన్నం చేసుకునేలా హామీలు గుప్పించారు. అయితే చంద్రబాబు హామీలు ఆచరణ సాధ్యం కాదని.. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థతి ఏమాత్రం సహకరించదని అందరూ అనుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పెన్షన్లపై కీలక హామీ ఇచ్చారు. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడు తుందని ఆ నెల నుంచే 4వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఏప్రిల్ నుంచే ఇది అమలు చేస్తామని మాటిచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మిగిలిన వెయ్యి రూపాయలను జులై నెలలో 4వేలతో కలిపి మొత్తం 7వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పారు. చంద్రబాబు హామీ విని ఇది అయ్యే పని కాదులే.. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే ఇలా ఊరిస్తున్నారని చాలా మంది అనుకున్నారు. వైసీపీ నేతలైతే చంద్రబాబు చెప్పింది ఏనాడూ చేయరని.. ఆయన వలలో పడొద్దని ఎద్దేవా చేస్తూ వచ్చారు.

కానీ జూన్ లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు జులై ఒకటినే పెన్షన్లను అందించాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. జూన్ 12న చంద్రబాబు బాధ్యతలు చేపడితే 18 రోజుల్లో అంత పెద్ద మొత్తాన్ని సర్దాల్సిన బాధ్యత ఏర్పడింది. అయినా చంద్రబాబు వెనక్కు వెళ్లలేదు. తాను చెప్పినట్టుగానే జులై 1న ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. తన హామీని నెరవేర్చుకున్నారు. దీంతో చంద్రబాబుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోవడం, పగ్గాలు చేపట్టి 20 రోజులే కావడంతో ఏదైనా సాకు చెప్పి పెన్షన్లను వాయిదా వేస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పెన్షన్లను చెప్పినట్లే ఇచ్చి అవ్వాతాతల మెప్పు పొందారు. మరి మిగిలిన హామీలను కూడా చంద్రబాబు ఇలాగే అమలు చేయగలరా అనేది వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :