ఆస్ట్రేలియాలో తెలుగోడి ధీమా, కోచ్ నమ్మకం నిలబెట్టాడు
భారత్ వరల్డ్ కప్ గెలిచినా... వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ గెలిచినా ఓ బాధ మాత్రం భారత క్రికెట్ అభిమానులను వెంటాడుతూనే ఉంటుంది. అదే పేస్ ఆల్ రౌండర్ లేని లోటు. అగ్ర శ్రేణి జట్లకు పేస్ ఆల్ రౌండర్ ఉంటే మాత్రం స్పిన్ ఆల్ రౌండర్ తో మ్యాచ్ లు ఆడుతోంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ పైనే భారత్ ఆధారపడుతోంది. ఈ లోటు భర్తీ చేయడానికి ఎందరో ఆటగాళ్లను ప్రయోగించినా ఇప్పటి వరకు ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. చివరకు వెస్టిండీస్, శ్రీలంక దేశాలకు కూడా పేస్ ఆల్ రౌండర్లు ఉన్నారు.
ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దృష్టి పెట్టలేకపోవడమో... మరేదైనా కారణమో తెలియదు గాని నిఖార్సైన పేస్ ఆల్ రౌండర్ మాత్రం భారత్ కు దొరకలేదు. కాని ఇప్పుడు తెలుగోడి రూపంలో భారత్ కు నిఖార్సైన ఆల్ రౌండర్ దొరికినట్టే కనపడుతోంది. సీనియర్ ఆటగాళ్ళు అందరూ విఫలైమైనా మన తెలుగు కుర్రోడు మాత్రం అదరగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్ట్ లో విఫలమైన సమయంలో నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము రేపాడు. కీలక సమయంలో... రిషబ్ పంత్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్ 150 పరుగులకు ఆల్ అవుట్ అయితే అందులో నితీష్ చేసిన పరుగులే 41. ముందు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినా తర్వాత మాత్రం చాలా నమ్మకంగా బౌలింగ్ చేసాడు. నితీష్ వికెట్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఉపయోగం లేకపోయింది. చివరకు వేగంగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. అంత ఒత్తిడిలో కూడా రివర్స్ స్వీప్ లు ఆడాడు. సాలిడ్ డిఫెన్స్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. వరుసగా వికెట్ లు పడుతున్న సమయంలో అడ్డుగోడగా నిలబడి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
పంత్ తో కలిసి కీలక సమయంలో... నితీష్ నిలబడకపోతే భారత్... 120 పరుగులు కూడా చేయడం కష్టం అయ్యేది. అయితే తొలి రోజు... నితీష్ కు... బంతి అందించకపోవడంతో అతనికి బౌలింగ్ అవకాశం రాలేదు. ఐపిఎల్ లో దుమ్ము రేపిన నితీష్... బంగ్లాదేశ్ తో టి20 సీరీస్ లో కూడా అదరగొట్టాడు. టి20 ఫార్మాట్ కు అలవాటు పడిన ఆటగాడ్ని ఆస్ట్రేలియాతో సీరీస్ కు తీసుకు వెళ్ళడం మాత్రం కోచ్ గౌతం గంభీర్ చేసిన సాహసమే. ఈ సీరీస్ లో నితీష్ గనుక బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తే అతని కెరీర్ కు తిరుగు ఉండదు. పేస్ ఆల్ రౌండర్ లోటును భర్తీ చేయడానికి కష్టపడుతున్న జట్టు యాజమాన్యానికి నాణ్యమైన ఆల్ రౌండర్ దొరికినట్టే.