ప్రధాని మోడీపై పదే పదే విధేయత.. నితీష్ కుమార్ ఆంతర్యమేంటి..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పట్ల బహిరంగ వేదికలపై కూడా విధేయత చాటుకుంటున్నారు.దర్భంగాలో జరిగిన ర్యాలీలోనూ నితీష్ ఇదే తరహాలో విధేయత చాటుకున్నారు. మోడీ పాదాలకు నితీష్ మొక్కే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే మోడీ ఆయనను వారించారు. ప్రధాన మంత్రి రూ.12,1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకిత చేసేందుకు బీహార్ వచ్చారు. దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో 18 జన్ ఔషధి కేంద్రాలను కూడా జాతికి ప్రధాని అంకితం చేశారు.
ఈ సందర్భంగా దర్బంగాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో నితీష్ చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. సుపరిపాలన అంటే ఏమిటో నితీష్ చూపించారని, జంగిల్ రాజ్‌గా ఉండే బీహార్‌ను ఇంత ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన నితీష్‌ను ఎంత అభినందించినా తక్కువేనని అన్నారు. అనంతరం నితీష్ ప్రసంగిస్తూ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న మద్దతుకు గాను ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగం ముగియగానే ఆయన నేరుగా ప్రధాని కూర్చున్న చోటుకు వెళ్లి ఆయన పాదాలకు మెుక్కే ప్రయత్నం చేయడంతో మోదీ వారించారు.
గత జూన్ లో ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశ సమయంలోనూ ప్రదాని మోడీ పాదాలకు మొక్కే ప్రయత్నం చేశారు నితీష్ కుమార్. ప్రధాని వెంటనే వారించి ఆయనతో కరచాలనం చేశారు. ఎన్నికల సమయంలో పదేపదే నితీష్ కుమార్... మోడీకి విధేయత చాటుకుంటుండడం .. అక్కడ కూటమికి ప్లస్ అవుతుందో లేదో కానీ... సీనియర్ నాయకుడైన నితీష్ చర్యలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి.