నార్డిక్ దేశాల్లో అణు యుద్ధం ప్రకంపనలు..
త్వరలోనే ప్రపంచం అంతం కానుందా...? అణుయుద్ధానికి సంకేతాలు మొదలయ్యాయా..? వెయ్యిరోజులుగా సంప్రదాయ పద్దతిలో యుద్ధం చేసిన రష్యా.. తొలిసారిగా పంథా మార్చిందా..? ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా మొదటిసారి ప్రయోగించడంతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. ఇంతకూ ఈ మిస్సైల్ అంత ప్రమాదమా? అసలు యుక్రెయిన్ ఎందుకు భయపడుతోంది? ప్రపంచదేశాల్లో కలవరపాటుకు కారణమేంటి..? ముఖ్యంగా నార్డిక్ దేశాలైతే ఎందుకింతలా బెంబేలెత్తుతున్నాయి. డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, నార్వే, స్వీడన్.. వీటన్నింటిని కలిపి నార్డిక్ దేశాలని పేరు. పశ్చిమ ఐరోపాలో ఉత్తరాన ఆర్కిటిక్ వరకు ఈ దేశాలు విస్తరించి ఉంటాయి.
అసలు యుద్ధం అంటే ఏంటో కూడా తెలియని ప్రశాంతతకు కేరాఫ్ లాంటి దేశాలివి. అలాంటిది రెండున్నరేళ్ల కిందట వీరికి భయం పట్టుకుంది. శతాబ్దాలుగా ఏ సైనిక కూటమిలోనూ లేని ఆ దేశాలు.. ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ యుద్ధ భయంతో నాటోలో చేరాయి. అదే పాపమైంది. ఇప్పుడు మరింత భయంతో వణికిపోతున్నాయి. యుద్ధం ముదిరితే, ప్రపంచ యుద్ధంగా మారితే, ఎలా ఉండాలి, ఏం చేయాలో జనాలకు సూచిస్తున్నాయి ఈ దేశాలు. ప్రపంచంలోనే సంతోషకర దేశాల్లో ఫిన్ ల్యాండ్, స్వీడన్ టాప్ లో ఉంటాయి.
రష్యాతో యూరప్ లోనే ఫిన్లాండ్ కు అత్యంత సుదీర్ఘ సరిహద్దు ఉంది. స్వీడన్ కు, రష్యాకు మధ్య 15 కిలోమీటర్ల సరిహద్దే ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో కీలకంగా మారింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి నార్డిక్ దేశాల టెన్షన్ అంతా ఇంతా కాదు. నార్డిక్ దేశాలు రష్యా నుంచి దాడి జరిగితే ఎలా వ్యవహరించాలన్న అంశంపై..తమ పౌరులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఆశ్రయం పొందడం మరియు సరఫరాలను ఎలా నిల్వ చేయాలనే సలహాతో మిలియన్ల కొద్దీ గృహాలకు కరపత్రాలు మరియు ఇమెయిల్‌లను పంపుతున్నాయి.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా స్వీడన్ మరియు ఫిన్లాండ్‌లను రక్షణ వ్యయాన్ని పెంచేశాయి. అంతేకాదు...దశాబ్దాల తటస్థ విధానాన్ని విడిచిపెట్టాయి.ఫిన్నిష్-రష్యన్ సరిహద్దు నుండి 70 మైళ్ల దూరంలో ఉన్న లాప్‌ల్యాండ్‌లో బ్లాక్ అంతటా ఉన్న దళాలు కసరత్తులు చేస్తున్నాయి. NATO చరిత్రలో అతిపెద్ద ఫిరంగి విన్యాసాల్లో 28 దేశాలు పాల్గొంటున్నాయి.