సౌండ్ గన్... కిమ్ విచిత్ర యుద్ధం..
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. నియంతలకే నియంత. ఓ పని అనుకున్నాడో.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. అది అమెరికా అధ్యక్షుడైనా.. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా పౌరుడైనా ఒక్కటే. దశాబ్దాలుగా కిమ్ పాలనలోని ఉత్తరకొరియా తీరుతో.. దక్షిణ కొరియా నానా అగచాట్లు పడుతోంది. ప్రత్యక్ష యుద్ధం చేయడం లేదు కానీ.. పరోక్ష యుద్ధంతో సియోల్ ను తీవ్ర ఇబ్బందిపెడుతున్నాడు. లేటెస్టుగా లౌడ్ స్పీకర్లతో భారీగా సౌండ్స్ చేస్తూ .. సౌత్ కొరియన్లను ఎటాక్ చేస్తున్నాడు కిమ్. లౌడ్ స్పీకర్లతో దక్షిణ కొరియన్లకు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ నరకం చూపుతున్నాడు.
దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలో మెటాలిక్ గ్రైండింగ్ చేయిస్తూ లౌడ్ స్పీకర్లు పెట్టి ఆ శబ్దాలను అక్కడి దక్షిణ కొరియన్లకు వినిపిస్తున్నారు. దీంతో సౌత్ కొరియా డీమిలిటరైజ్డ్ జోన్ వద్ద డాంగ్ సన్ గ్రామస్తులు నరకం అనుభవిస్తున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా వస్తున్న ఆ శబ్దాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని డాంగ్ సన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ భీకర శబ్దాలను భరించలేకపోతున్నామని, శబ్దాలు వినివిని తమకు పిచ్చెక్కిపోతున్నదని చెబుతున్నారు.
.‘‘ఆ శబ్దాలతో రాత్రిపూట మాకు నిద్రరావడం లేదు. రోజంతా నరకంగా ఉంది. తోడేళ్లు ఊల వేస్తున్నట్లు, ఫిరంగులు పేల్చినట్లు ఉంది. దీంతో నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి” డాంగ్ సన్ వాసులు పేర్కొన్నారు. మొన్నటివరకూ చెత్త నింపిన బెలూన్లను వదులుతూ.. సౌత్ కొరియా సర్కార్ కు చుక్కలు చూపించాడు కిమ్. ఆ బెలూన్ల కారణంగా పలు విమానసర్వీసులు సైతం రద్దు చేసుకుంది సౌత్ కొరియా.
అందులోనూ ఆ బెలూన్లలో విషపూరితమైన చెత్తతోపాటు మానవ, జంతు వ్యర్థాలు నింపి సౌత్ కొరియా బోర్డర్ ద్వారా వదులుతున్నట్లు గుర్తించింది సియోల్.దానిపై అంతర్జాతీయ దేశాలకు, ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది కూడా. ఇప్పుడు దీనికి తోడు భారీ శబ్దాలతో సౌత్ కొరియన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు కిమ్. ఈ చర్యలతో నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాగా.. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేపడుతున్న సైనిక విన్యాసాలకు స్పందనగా కిమ్.. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సౌత్ కొరియా ఆరోపిస్తున్నది.