RGV : రామ్ గోపాల్ వర్మ దాగుడుమూతలు..! దొరికితే చుక్కలేనా..?
రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారంటూ రామ్ గోపాల్ వర్మపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన్ను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం 19న విచారణకు రావాలని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. అక్కడి నుంచే ట్విస్టులు మొదలయ్యాయి.
19న రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆరోజు విచారణకు హాజరు కాలేనని.. షూటింగులో బిజీగా ఉన్నానని వాట్సాప్ ద్వారా సమాచారం పంపించారు. దీంతో పోలీసులు 25న విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంతలో వర్మ ఏపీ హైకోర్టులో తనపై పోలీసులు పెట్టిన కేసు కొట్టాయని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ అరెస్టు చేస్తారనే భయం ఉంటే ముందస్తు బెయిల్ కు పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. అంతేకాక.. విచారణకు గడువు కావాలనుకుంటే పోలీసులనే అడగాలని స్పష్టం చేసింది. దీంతో వర్మ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఇంతలోనే 25వ తేదీ రావడంతో వర్మ విచారణకు హాజరవుతారని పోలీసులు భావించారు. అయితే విచారణకు రాకుండా తనకు మరింత సమయం కావాలంటూ వాట్సాప్ మెసేజ్ పంపించారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ లో వాలిపోయారు. అక్కడ వర్మ లేరు. ఆయన తరపు న్యాయవాది మాత్రం వర్మ అందుబాటులో లేరని చెప్పుకొచ్చారు. అవసరమైతే డిజిటల్ విచారణకు సిద్ధమని చెప్పారు. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది. సోషల్ మీడియా అకౌంట్ల హ్యండ్లింగ్ మాత్రం హైదరాబాద్ లోనే చూపిస్తోంది. వర్మ హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్ లో ఉన్నట్టు సమాచారం. అయితే తాను కోయంబత్తూర్ లో ఉన్నట్టు వర్మ ఓ ఫోటో విడుదల చేశారు.
అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే వర్మ ఇలా చేస్తున్నారని అర్థమవుతోంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకూ ఇలా ఉండాలనే ఆలోచనలో వర్మ ఉన్నట్టు అర్థమవుతోంది. ముందస్తు బెయిల్ మంజూరైతే పోలీసుల ముందు హాజరు కావాలని వర్మ భావిస్తున్నారు. అందుకోసమే ఈ డ్రామాలు. ఆ తీర్పు రాకుండా పోలీసులకు విచారణకు వెళ్తే తనను అరెస్టు చేస్తారనే భయం వర్మలో ఉంది. పైగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని వర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే వర్మ ఇలా దాగుడుమూతలు ఆడితే పోలీసులు నిజంగానే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని సోషల్ మీడియాలో సెటైర్లు కనిపిస్తున్నాయి.