Pawan Kalyan : పోలీసుల మత్తు వదలగొట్టిన పవన్ కల్యాణ్..!!
ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ తీరు ఇటీవలికాలంలో అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో పోలీసులు వ్యవహరించిన తీరు మరీ విమర్శలపాలైంది. పూర్తిగా అధికారపార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు పోలీసులు. న్యాయం, చట్టం లాంటి వాటిని పక్కన పెట్టేసి పాలకులు చెప్పినట్లు నడుచుకున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం మారగానే పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నాడు వైసీపీకి తొత్తులుగా పనిచేసిన పలువురు ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే వేటు పడింది. అయినా కొంతమంది పోలీసుల తీరులో మార్పు రాలేదు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయి. కొంతమంది అమ్మాయిలు హత్యకు గురయ్యారు. మరోవైపు గతంలో లాగే సోషల్ మీడియాలో నేతలు, వాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వాటిపైన పోలీసులు స్పందిస్తారని.. చర్యలు తీసుకుంటారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశించారు. అయితే పోలీసులు ఇలాంటి అంశాలపట్ల సీరియస్ గా స్పందించలేదు. చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇది పవన్ కల్యాణ్ కు ఆగ్రహం తెప్పించింది.
దీంతో ఇటీవల హోంమంత్రి అనితను కోట్ చేస్తూ పవన్ కల్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసులు సీరియస్ గా స్పందించట్లేదని.. ఇలాంటి వాటిపై అనిత కూడా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ లో కూడా పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కాలేదన్నారు. తానే నేరుగా ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసినా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేబినెట్లో నిలదీశారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నెల రోజుల్లో మార్పు తీసుకొస్తానని చెప్పారు.
పవన్ కల్యాణ్ అలా కేబినెట్లో ఈ అంశాన్ని లేవనెత్తారో లేదో.. వెంటనే పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. భారతీరెడ్డి పీఎగా చెప్పుకుంటున్న వర్రా దేవందర్ రెడ్డిని కడప జిల్లా పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేశారు. దీంతో పోలీసులపై సీఎం, డీజీపీ సీరియస్ అయ్యారు. ఏకంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీవేటు వేశారు. మరో సీఐని సస్పెండ్ చేశారు. అదే సమయంలో వైసీపీనేత బోరుగడ్డ అనిల్ కు హోటల్లో రాచమర్యాదలు చేసిన ఏడుగురు పోలీసులపై వేటు పడింది. ఇన్నాళ్లూ పోలీసులు మారతారని ఆశించిన ప్రభుత్వ పెద్దలకు నిరాశే ఎదురవుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యలపై పోలీసులు వణికిపోతున్నారు. కక్షగట్టి వ్యవహరించాల్సిన అవసరం లేదని.. కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా శిక్ష పడాలని చంద్రబాబు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ ఆ మాటలను అర్థం చేసుకోవడంలో ఇన్నాళ్లూ పోలీసులు ఫెయిల్ అయ్యారు. మరి ఇప్పటికైనా మేల్కొంటారో లేదో చూడాలి.